మణిపూర్‌లో కొనసాగుతున్న అల్లర్లు.. ఆయుధాల లూటీకి యత్నం

Mob Tries To Block Movements, Loot Weapons From Army Camp In Manipur, 1 Rioter Killed

ఇఫాల్‌ః మణిపుర్‌లో చెల్లరేగిన అల్లర్లు ఇంకా కొనసాగుతునే ఉన్నాయి. తాజాగా అక్కడ ఇండియన్ రిజర్వు బెటాలియన్ ఉంటున్న ప్రాంతం వద్దకు అల్లరి మూకలు వచ్చాయి. ఆ తర్వాత అక్కడ సైనికులు వాడుతున్న ఆయుధాలను లూటీ చేసేందుకు ప్రయత్నించారు. అయితే వీరిని భద్రతా దళాలు అడ్డుకున్నాయి. అయితే ఈ ఘర్షణల్లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ధౌభాల్ జిల్లాలోని ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఇక్కడికి వందల సంఖ్యలో అల్లరి మూకలు ఐఆర్‌బీ బెటాలియన్ పోస్టుపై దాడులకు పాల్పడ్డాయి. బెటాలియన్‌కు మద్ధతుగా సైన్యం, ఆర్పీవో లాంటి దళాలు రాకుండా అల్లరి మూకలు రహదారులను ముందుగానే తవ్వాయి.

అయినప్పటికీ అస్సాం రైఫిల్స్‌, ఆర్పీవో దళాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. దీంతో ముప్పు తప్పింది. వీళ్లు అల్లరిమూకలను అక్కడి నుంచి వెళ్లగొట్టారు. ఈ క్రమంలోనే ఓ దుండగుడు ప్రాణాలు కోల్పోయాడు. ప్రస్తుతం మణిపుర్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయి. అక్కడ రాష్ట్రవ్యాప్తంగా 118 చెక్ పాయింట్లు ఏర్పాటు చేశారు. అనుమానం వచ్చినవారిలో ఇప్పటికి దాకా 326 మందిని అరెస్టు చేశారు.

మరోవైపు బుధవారం తెల్లవారు జామున మరో హింసాత్మక ఘటన చోటుచేసుకుంది. ఉదయం 4.30 గంటలకు తూర్పు ఫైలింగ్ ప్రాంతంలో కాల్పులు జరిగాయి. అలాగే మంగళవారం రాత్రి కూడా ఖోయిజుంతాబి ప్రాంతంలో కాల్పులు జరిగాయి. అయితే ఈ దుర్ఘటనలో ప్రాణనష్టం జరగలేదు.