ఫ్రాన్స్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మె

strike in-France
strike in-France

పారిస్‌ : ఫ్రాన్స్‌లో కార్మికులు, ఉద్యోగులు కదంతొక్కారు. గురువారం తమ విధులను బహిష్కరించి దేశవ్యాప్త సమ్మెలో పాల్గొన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ బైజాంటీన్‌ తరహా పెన్షన్‌ విధానాన్ని తీసుకురానున్నట్టు ప్రకటించారు. ఈ విధానం ద్వారా అన్ని వర్గాల కార్మికులకు, ఉద్యోగులకు సారూప్యమైన పెన్షన్‌ అందనుంది. ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా కార్మికులు, ఉద్యోగులు నిరసనలు చేపట్టారు. ప్లకార్డులు, బ్యానర్లు చేబూని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెన్షన్‌ చెల్లింపు విధానంలో మాక్రాన్‌ తీసుకురానున్న సంస్కరణలను వ్యతిరేకిస్తున్నామంటూ నినాదాలు చేశారు. రోడ్లపై టైర్లు దగ్ధం చేశారు. వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. పారిస్‌ నగరంలో రైల్వే, మెట్రో స్టేషన్‌ కార్మికులు విధుల నుంచి బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. సైకిళ్లపై తిరుగుతూ ప్రభుత్వ వ్యతిరేకంగా నినాధాలు చేశారు. పెన్షన్‌ మంజూరులో ప్రభుత్వ సంస్కరణల కారణంగా తక్కువ పెన్షన్‌ స్వీకరించి ఎక్కువ కాలం పనిచేయాల్సిన దుస్థితి ఏర్పడుతుందని నిరసనకారులు ఆవేదన వ్యక్తం చేశారు. సారూప్య పెన్షన్‌ విధానం ద్వారా కార్మికులు, ఉద్యోగుల పనిగంటలు పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. గురువారం కార్మికులు, ఉద్యోగులు తలపెట్టిన సమ్మెలో ఉపాధ్యాయులు, లాయర్లు, ఆరోగ్యశాఖ సిబ్బంది, రవాణా రంగం కార్మికులు, ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నట్టు స్థానిక మీడియా ప్రకటించింది. కార్మికులు, ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో విద్యాసంస్థలు స్వచ్చంధంగా సెలవు ప్రకటించాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/