పాకిస్థాన్‌లో సిక్కు యువకుడి దారుణ హత్య

భారత సంతతికి చెందిన వ్యక్తిపై పబ్లిక్‌గా కాల్పులు

Sikh youth murdered in Peshawar
Sikh youth murdered in Peshawar

ఇస్లామాబాద్: పాకిస్తాన్ లో మరో ఘాతుకం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు కొందరు ఓ సిక్కు యువకుడిని దారుణంగా హత్య చేశారు. పాకిస్తాన్ లోని పెషావర్ జిల్లాలో ఆదివారం ఈ ఘటన సంభవించింది. మృతుడి పేరు పర్వీందర్ సింగ్. 29 సంవత్సరాలు. పెషావర్ లో జర్నలిస్టుగా పని చేస్తోన్న హర్మీత్ సింగ్ సోదరుడిగా ఆయనను గుర్తించారు. తన వ్యాపార కార్యకాలాపాలను విస్తృతం చేయడంలో భాగంగా.. కొద్దిరోజుల కిందటే ఆయన పెషావర్ కు వెళ్లారు. వచ్చే నెలలో పర్మీందర్ సింగ్ వివాహం జరగాల్సి ఉంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులను ఆహ్వానించడానికి పెషావర్ కు వెళ్లారు. ఆదివారం తన సోదరుడు హర్మీత్ సింగ్ తో కలిసి స్థానికంగా షాపింగ్ కు వెళ్లారు. మొదట ఆయనతో గొడవ పడ్డారు. అనంతరం పర్వీందర్ సింగ్ పై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో రెండు బుల్లెట్లు పర్వీందర్ సింగ్ శరీరంలోకి దూసుకెళ్లాయి. ఫలితంగా ఆయన అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలాన్ని రేపింది. పాకిస్తాన్ లో మైనారిటీలుగా జీవిస్తోన్న హిందువులకు భద్రత లేదంటూ హర్మీత్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హంతకులను వీలైనంత త్వరగా అరెస్టు చేస్తామని హామీ ఇచ్చారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/