పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌కు నోటీసులు జారీ

pakistan prime minister imran khan
pakistan prime minister imran khan

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు 2017 నాటి ఓ పరువు నష్టం కేసులో ఓ స్థానిక కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ముందస్తు విచారణ చేపట్టాలని కోరుతూ దీన్ని దాఖలు చేసిన పీఎంఎల్ఎన్ పార్టీ చీఫ్ షాబాజ్ షరీఫ్ అభ్యర్థన మేరకు కోర్టు స్పందించింది. షాబాజ్ షరీఫ్ పెద్దన్నయ్య, పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై సుప్రీంకోర్టులో దాఖలైన పనామా పేపర్ల కేసును ఉపసంహరించుకుంటే 61 మిలియన్ డాలర్లు ఇస్తామని షాబాజ్ ఆఫర్ చేసినట్టు 2017 ఏప్రిల్‌లో ఇమ్రాన్ ఆరోపించారు. మూడేళ్లుగా ఇమ్రాన్ రాతపూర్వకంగా సమాధానం చెప్పనందున ఈ కేసులో ఎలాంటి పురోగతి లేకుండా పోయిందనీ.. ఈ నెల 10న దీనిపై విచారణ చేపట్టాలని షాబాజ్ షరీఫ్ తన పిటిషన్‌లో కోరారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న లాహోర్‌ జిల్లా అదనపు, సెషన్స్ కోర్టు ఇమ్రాన్‌కు నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం నవాజ్ షరీఫ్ లండన్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పనామా పేపర్ల కేసులో ఆయనను ప్రధాని పదవి నుంచి తొలగిస్తూ పాక్ సుప్రీంకోర్టు 2017లో తీర్పు వెలువరించింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/