బోల్సనారో చర్యలపై లూలా ఆందోళన

Luiz Inacio Lula Dasilva
Luiz Inacio Lula Dasilva

బ్రసీలియా : బ్రెజిల్‌లో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని మాజీ అధ్యక్షుడు లూయిజ్‌ ఇనాసియో లూలా డసిల్వా ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యం పీక నులిమేందుకు పచ్చి మితవాది అయిన అధ్యక్షుడు జెయిర్‌ బోల్సనారో, రిటైర్డు జనరల్‌ అగస్టో హెలినో కుట్ర పన్నారని ఆయన విమర్శించారు. వీరి చర్యలతో ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడిందన్నారు. బ్రెజిలియన్‌ పార్లమెంటు (కాంగ్రెస్‌)కు వ్యతిరేకంగా మార్చి15న ఉద్యమించాలని వాట్సాప్‌ ద్వారా ఇచ్చిన సందేశంలో బోల్సనారో పేర్కొన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. మార్చిలో ఆందోళన ప్రతిపాదన బోల్సనారో సన్నిహితుడు, సంస్థాగత భద్రతా మంత్రి హెలినో మొదట ముందుకు తేగా, దానికి బోల్సనారో మద్దతు ఇచ్చారని స్థానిక మీడియా వెల్లడించింది. బయటపడిన ఆ వీడియోలో ‘బ్రెజిల్‌ మనది, రాజకీయ నాయకులది కాదు’, ‘ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మార్చి 15న జరపతలపెట్టిన ప్రదర్శనకు పెద్ద సంఖ్యలో తరలిరావాలి’ అని బోల్సనారో కోరారు. దీనికి లూలా దీటుగా జవాబిచ్చారు. బ్రెజిల్‌లో ప్రజల స్వేచ్ఛ, హక్కులపై అనునిత్యం దాడులు జరుపుతున్న నిరంకుశ బోల్సనారో ప్రభుత్వం ఇప్పుడు ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, ఇతర సంస్థలపై దాడులకు తెగబడుతోందని విమర్శించారు. ఈ దాడుల నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ గొంతువిప్పాలని లూలా బ్రెజిల్‌ సమాజానికి విజ్ఞప్తి చేశారు.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/