ఇతర దేశాలలో జోక్యం అనుచితం

వాణిజ్య, పెట్టుబడులలో మరింత సాయం

PM Modi, Vladimir Putin
PM Modi, Vladimir Putin

వ్లాడివోస్టాక్ : ఇతరదేశాల అంతర్గత వ్యవహారాలకు దూరంగా ఉంటామని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. భారత్, రష్యాలది ఇదే సంవిధానమని ఆయన తెలిపారు. రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్‌తో బుధవారం ఆయన ఇక్కడ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా పలు విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. రెండు రోజుల రష్యా పర్యటనకు ప్రధాని మోడీ వచ్చారు. వాణిజ్య, పెట్టుబడులలో సహకారం పెంపుదల, చమురు సహజవాయువు, అణు ఇంధనం, రక్షణ, అంతరిక్షం, సముద్ర మార్గ అనుసంధానం వంటి కీలక అంశాలు ఇరువురు నేతల మధ్య చర్చకు వచ్చాయి. రష్యాలోని దూర ప్రాంతంలో జరిగే ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం ( ఇఇఎఫ్) సదస్సులో పాల్గొనే తొలి భారత ప్రధాని మోడీనే కావడం గమనార్హం. ప్రెసిడెంట్ పుతిన్‌తో చర్చల తరువాత ప్రధాని మోడీ పుతిన్‌తో కలిసి సంయుక్త విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.

కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో ప్రధాని మోడీ ప్రత్యేకించి దేశ అంతర్గత వ్యవహారాలలో ఇతరుల జోక్యం గురించి పుతిన్ సమక్షంలో ప్రస్తావించారు. కశ్మీర్ భారతదేశ అంతర్గత వ్యవహారం, భారత రాజ్యాంగ పరిధిలోనే కశ్మీర్ ప్రతిపత్తిలో మార్పు లు జరిగాయని ఇటీవలే రష్యా ప్రకటించింది. నౌక ప్రయాణంలోనే ఇరువురు నేతల మధ్య రెండు గంటల పాటు ముఖాముఖీ చర్చలు జరిగాయి. ఆ తరువాత ఇండియా రష్యా 20వ వార్షిక సదస్సులో ఇరువురు నేతల మధ్య ప్రతినిధుల స్థాయి సంప్రదింపులు కూడా జరిగాయి. ఇందులో ప్రత్యేకంగా వాణిజ్యం పెట్టుబడులలో మరింత సహకారం అంశం ప్రస్తావనకు వచ్చాయి. మైనింగ్ , రక్షణ, భద్రతా అంశాలు, గగనతల, సముద్ర జలాల అంశాలు కూడా చర్చకు వచ్చాయి. పలు అంశాలకు సంబంధించి రెండు దేశాల మధ్య 15 ఒప్పందాలు ఎంఒయులపై సంతకాలు జరిగాయి.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/