పాక్ ప్రధాని మరోసారి మోదీకి లేఖ

Imran Khan , Narendra Modi
Imran Khan , Narendra Modi

ఇస్లామాబాద్:  పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ మరోసారి శాంతి చర్చలకు ముందుకు రావాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కశ్మీర్ అంశం సహా పలు సమస్యలు, వివాదాలపై చర్చలకు తాము సిద్ధమేనని ఆయన ఈ లేఖలో పేర్కొన్నట్టు పాక్ మీడియా వెల్లడించింది. వచ్చే వారం బిష్కెక్‌లో జరిగే ఎస్‌సీవో శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఇరు దేశాధినేతల మధ్య ఎలాంటి చర్చలు ఉండబోవంటూ భారత్ స్పష్టం చేసిన నేపథ్యంలోనే పాక్ ప్రధాని లేఖ రాయడం గమనార్హం. రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్రమోదీకి తన లేఖలో అభినందనలు తెలిపిన ఇమ్రాన్… ఇరుదేశాల ప్రజలు పేదరికాన్ని అధిగమించాలంటే రెండు దేశాల మధ్యా చర్చలే మార్గమని పేర్కొన్నట్టు జీయోటీవీ వెల్లడించింది. ప్రాంతీయ అభివృద్ధికి ఇరుదేశాలు కలిసికట్టుగా పనిచేయడం అత్యంత కీలకమని ఇమ్రాన్ పేర్కొన్నట్టు తెలిపింది. అయితే ఈ లేఖపై భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.