ఆగిన కులభూషణ్‌ మరణశిక్ష

అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్‌కు భారీ విజయం

kulbhushan
kulbhushan

ది హేగ్ : భారత నౌకాదళ రిటైర్డ్ అధికారి కులభూషణ్ జాదవ్‌కు పాకిస్థాన్ విధించిన ఉరిశిక్షను నిలిపివేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసిజె) తీర్పు వెలువరించింది. గూఢచార్యం, ఉగ్రవాదం అభియోగాలపై జాదవ్‌ను పాకిస్థాన్ అధికారులు అరెస్టు చేశారు. 2017లో రహస్య విచారణ తరువాత ఆయనకు మరణశిక్షను విధిస్తూ పాకిస్థాన్ సైనిక తీర్పు వెలువరించింది. అయితే ఎటువంటి ప్రతివాదనకు తావు ఇవ్వకుండా సాగిన విచారణ ప్రక్రియను ఐసిజె తప్పు పట్టింది. ఈ వ్యవహారంలో జాదవ్‌కు విధించిన మరణశిక్షపై పాకిస్థాన్ పునః సమీక్షించుకోవాలని , అప్పటివరకూ మరణశిక్ష అమలును నిలిపివేస్తున్నట్లు న్యాయస్థానం బుధవారం తీర్పు వెలువరించింది.

16 మంది న్యాయమూర్తులతో కూడిన ఐసిజె బెంచ్‌లో 15 మంది భారతదేశానికి అనుకూలంగా రూలింగ్ వెలువరించారు. దీనితో జాదవ్‌ను పాకిస్థాన్ ఉరి నుంచి తప్పించేందుకు ఇన్నేళ్లుగా భారతదేశం సాగిస్తూ వచ్చిన పలు రకాల యత్నాలలో ఘన విజయం దక్కింది. కేసు విచారణ అత్యంత రహస్యంగా జరగడం వల్ల న్యాయం జరగలేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. . 49 సంవత్సరాల జాదవ్‌కు పాకిస్థాన్ మరణశిక్షను విధించడంపై పలు స్థాయిలలో నిరసన వ్యక్తం అయింది. జాదవ్‌ను కలుసుకోవడానికి ఎవరికి అనుమతిని ఇవ్వకుండా, భారతదేశపు దౌత్య వర్గాలు కానీ, న్యాయవాద సాయం కానీ అందకుండా ఏకపక్షంగా విచారణ సాగించారనే వాదనలోని అంశాలను అంతర్జాతీయ న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/