దలైలామా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌

dalai lama
dalai lama


న్యూఢిల్లీ: ప్రముఖ బౌద్ధ గురువు దలైలామా(83) ఇవాళ ఉదయం మ్యాక్స్‌ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఛాతిలో ఇన్‌ఫెక్షన్‌ రావడంతో మంగళవారం ఆయన ఆస్పత్రిలో చేరారు. ఇప్పుడు ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, కోలుకుంటున్నారని దలైలామా అధికార ప్రతినిధి తెన్‌జిన్‌ తక్లా వెల్లడించారు.
ఓ కాన్ఫరెన్స్‌ నిమిత్తం దలైలామా గత కొద్ది రోజుల నుంచి ఢిల్లీలోనే ఉంటున్నారు. సోమవారమే ధర్మశాల వెళ్లిన ఆయన వైద్య పరీక్షల నిమిత్తం మంగళవారం మ్యాక్స్‌ ఆస్పత్రిలో చేరారు.
దలైలామా అస్వస్థతకు గురైన నేపథ్యంలో ఆయన వారసుడి ఎంపిక ప్రశ్నార్ధకంగా మారింది. దలైలామా వారసుడిగా ఎవరైనా ఎంపిక ఐతే దానికి తమ అనుమతి తప్పనిసరి అని చైనా మరోమారు స్పష్టం చేసింది. బుధవారం నాడు ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి లూ కాంగ్‌ మాట్లాడుతూ..టిబెటన్ల పునర్జన్మల ఆచారం ప్రకారమే దలైలామా తదుపరి వారసుడి ఎంపిక జరుగుతుందని, ఐతే , ఆ ప్రక్రియ తమ దేశ చట్టాలు, నిబంధనలకు లోబడి ఉండాల్సిందేనని స్పష్టం చేసింది.
కాని గతంలో దలైలామా మరణించిన తర్వాత తన వారసుడిగా చైనా ఏకపక్షంగా ప్రకటిస్తే..అతన్ని టిబెట్‌ బౌద్ధులు గౌరవించే పరిస్థితి ఉండదని, అందుకే భారత్‌ నుంచే తన వారసుడు రానున్నాడని ఆయన గతంలో స్పష్టం చేశారు. ఐతే, దలైలామా వారసుడి ఎంపిక హక్కు తమదేనని చైనా ప్రకటించింది. టిబెటన్ల పునర్జన్మ నమ్మకాల ప్రకారం దలైలామా మరణిస్తే, ఆయన ఆత్మ ఓ చిన్నారిలోకి ప్రవేశిస్తుంది. ఆ చిన్నారిని గుర్తించే ప్రక్రియను బౌద్ధ గురువులు పూర్తి చేసి వారసుడిని ప్రకటిస్తారు. 1935లో జన్మించిన ప్రస్తుత దలైలామాను, ఆయన రెండేండ్ల వయసులో ఉండగానే మతగురువులు గుర్తించారు. ప్రస్తుతం ఆయన 14వ లామాగా కొనసాగుతూ, వయసు పైబడిన కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు.

తాజా జాతీయ ఎన్నికల వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/election-news-2019/indian-general-election-news-2019/