అమెరికా కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి

China-America
China-America

బీజింగ్‌: మ‌హ్మ‌ద్ చీఫ్ మ‌సూద్ అజ‌ర్‌ను అంత‌ర్జాతీయ ఉగ్ర‌వాదిగా ప్ర‌క‌టించేందుకు అమెరికా మ‌ళ్లీ ప్ర‌య‌త్నాలు పెట్టిన విషయం తెలిసిందే. అయితే అగ్రదేశాలు అమెరికా, చైనా మధ్య మాటల యుద్ధానికి దారి తీస్తున్నది. మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే తీర్మానాన్ని అమెరికా బలవంతంగా ప్రవేశపెట్టడం ఐక్యరాజ్య సమితి ఉగ్రవాద వ్యతిరేక కమిటీ అధికారాన్ని తక్కువ చేయడమే అవుతుందని చైనా స్పష్టం చేసింది. ఇలాంటి చర్యల వల్ల సమస్య మరింత జటిలమవుతుందే తప్ప పరిష్కారం కాదని డ్రాగన్ తేల్చి చెప్పింది. ఈ తీర్మానాన్ని అమెరికాతోపాటు ఫ్రాన్స్, బ్రిటన్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే అమెరికా తీరును చైనా విదేశాంగశాఖ ప్రతినిధి గెంగ్ షువాంగ్ తప్పుబట్టారు. ఈ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకునే పద్ధతి ఇది కాదు. ఇది కచ్చితంగా భద్రతా మండలి ఉగ్రవాద వ్యతిరేక కమిటీ అధికారాన్ని తక్కువ చేయడమే అవుతుంది. ఇలా చేయడం సమస్యను జటిలం చేస్తుంది తప్ప పరిష్కరించదు అని షువాంగ్ అన్నారు. అందుకే కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలని అమెరికాకు చెప్పదలచుకున్నాం. ఈ తీర్మానాన్ని బలవంతంగా ప్రవేశపెట్టే ప్రయత్నం చేయొద్దు అని గెంగ్ చెప్పారు.


మరిన్ని తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/