మరియం నవాజ్‌పై కేసు కొట్టివేత

Maryam Nawaz
Maryam Nawaz

ఇస్లామాబాద్‌ : లండన్‌లోని విలాసవంతమైన అవెన్‌ ఫీల్డ్‌ అపార్ట్‌మెంట్స్‌ కేసులో నకిలీ ఒప్పందాన్ని అధికారులకు అందచేశారన్న ఆరోపణలపై మాజీ ప్రధాని నవాజ్‌షరీఫ్‌ కుమార్తె మరియం నవాజ్‌పై నమోదయిన కేసును పాక్‌ అవినీతి నిరోధక న్యాయస్థానం శుక్రవారం కొట్టివేసింది. అపార్ట్‌మెంట్స్‌ కేసు విచారణ సమయంలో నకిలీ ఒప్పంద పత్రాలను అందచేశారని ఆరోపిస్తూ అవినీతి నిరోధక శాఖ మరియంపై అభియోగం మోపింది. 2006లో రూపొందించిన ఈ నకిలీ ఒప్పందాన్ని బహిరంగంగా లభ్యం కాని ‘కాలిబ్రి’ ఫాంట్‌లో రాశారు. ఈ కేసును విచారించిన అకౌంటబులిటీ కోర్టు న్యాయమూర్తి మహ్మద్‌ బషీర్‌ దీనిని కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు. విచారణ సమయంలో మరియం తన భర్త, మాజీ సైనికాధికారి మహ్మద్‌ సఫ్దర్‌, కొందరు సీనియర్‌ పార్టీ నేతలతో కలిసి కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో ఎన్‌ఎబి మరియంకు గత ఏడాది జులైలో విధించిన ఏడేళ్ల జైలు శిక్షను ఇస్లామాబాద్‌ హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. పనామా పత్రాల కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు నేపథ్యంలో ఎన్‌ఎబి షరీఫ్‌, కుటుంబ సభ్యులపై నమోదు చేసిన మూడు కేసుల్లో ఇది ఒకటి.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/