బ్రెజిల్‌ చమురు కార్మికుల సమ్మె

Brazilian oil workers
Brazilian oil workers

రియోడి జెనిరో : బ్రెజిల్‌ ప్రభుత్వ రంగ చమురు సంస్థ పెట్రోబ్రాస్‌ యాజమాన్యం కీలకేతర రంగాలపై నుండి దృష్టి మళ్లించటాన్ని నిరసిస్తూ బ్రెజిల్‌ చమురు కార్మికులు చేస్తున్న సమ్మె 19వ రోజుకు చేరుకుంది. ఈ సమ్మెలో వేలాది మంది కార్మికులు పాల్గొంటున్నారని కార్మిక సంఘాల సమాఖ్య ప్రకటించింది. పరానా రాష్ట్రంలోని ఒక ఎరువుల ఫ్యాక్టరీలో ఇటీవల ప్రకటించిన లేఆఫ్‌లకు వ్యతిరేకంగా సమ్మె చేస్తున్న కార్మికులు రియో డిజెనీరోలోని పెట్రోబ్రాస్‌ ప్రధాన కార్యాలయం ఎదుట భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. పారిశ్రామిక రంగంలో ప్రకటిస్తున్న లేఆఫ్‌లు ఆర్థికంగా, పన్నుల రూపంలో అన్ని రంగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని సమ్మె చేస్తున్న కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫాఫెన్‌ ఎరువుల ఫ్యాక్టరీ కార్మికులతోపాటు దేశవ్యాప్తంగా వున్న చమురు కార్మికుల హక్కుల పరిరక్షణ కోసమే తాము సమ్మె చేస్తున్నామని, అసలు సమస్యంతా పెట్రోబ్రాస్‌ పాలక వర్గం నుండి ఎదురవుతోందని కార్మిక నేతలు అంటున్నారు. కంపెనీ ఆస్తులను ప్రైవేటుపరం చేయటాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు చేస్తున్న ఈ సమ్మెకు వర్కర్స్‌ పార్టీతో సహా వామపక్ష పార్టీలు తమ మద్దతు ప్రకటించాయి.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/