బ్రిటన్ కొత్త ప్రధాని బోరిస్ జాన్సన్

Boris Johnson
Boris Johnson

లండన్‌: బ్రిటన్‌ కొత్త ప్రధానిగా మాజీ విదేశాంగ మంత్రి బోరిస్‌ జాన్సన్‌ను నియమిస్తూ రాణి ఎలిజెబెత్‌ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకూ ప్రధానిగా వ్యవహరించిన థెరెస్సా మే సమర్పించిన రాజీనామాను ఆమె ఆమోదించారు. కాగా బ్రెగ్జిట్‌కు గట్టి మద్దతుదారుగా నిలిచిన కొత్త ప్రధాని బోరిస్‌ జాన్సన్‌కు గడువులోగా ఈ ప్రక్రియను ఎటువంటి వివాదాలకు తావులేకుండా పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రాధాన్యతాంశంగా మారుతోంది. తనను తాను ఆశావాదిగా చెప్పుకునే జాన్సన్‌ బ్రెగ్జిట్‌ ప్రక్రియపై ఒప్పందం కుదుర్చుకోవటం లేదా ఎటువంటి ఒప్పందం లేకుండానే నిర్ణీత గడువు అక్టోబర్‌ 31లోగా పూర్తి చేస్తానని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ లక్ష్యాన్ని తాను సాకారం చేస్తానని ఆయన పునరుద్ఘాటించారు. బ్రెగ్జిట్‌పై ఐరోపా కూటమితో చర్చలు జరిపే విషయంలో తన ఆలోచనలను ఆయన ఇప్పటికే వెల్లడించారు. గతంలో కుదిరిన ఒప్పందంపై నిలువునా చీలిన పార్లమెంట్‌ను ఒప్పించగలిగే విధంగా తాను బ్రెగ్జిట్‌ ప్రక్రియను పూర్తి చేస్తానని ఆయన చెబుతున్నారు. గతంలో కుదిరిన ఒప్పందాన్ని పునఃపరిశీలించేందుకు అవసరమైన మద్దతును కూడగట్టేందుకు ప్రధాని జాన్సన్‌ ముందుగా బ్రస్సెల్స్‌, డబ్లిన్‌, బెర్లిన్‌, పారిస్‌లను సందర్శించాల్సి వుంటుందని బర్మింగ్‌హామ్‌ సిటీ యూనివర్శిటీలోని బ్రెగ్జిట్‌ స్టడీస్‌ విభాగం డైరెక్టర్‌ అలెక్స్‌ డీ రూటర్‌ స్పష్టం చేశారు.


తాజా జాతీయ వార్లల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/