హిల్లరీదే అధ్యక్ష పీఠం

HILLARIA
– 78% ఆమె వైపే నంటున్న సిఎన్‌ఎన్‌, ఒఆర్‌సి సర్వే
– నోటి దురుసే ట్రంప్‌ కొంప ముంచబోతోందని వ్యాఖ్య
న్యూయార్క్‌ :  అమెరికా అధ్యక్ష స్ధానానికి పోటీ పడుతున్న ట్రంప్‌ ఓ దశలో హిల్లరీ క్లింటన్‌ని మించి దూసుకు వెళ్లడంతో ఇక మనం గెలిచేయటమే మిగిలిందన్న తీరుగా వ్యవహరించారు. దీంతో పాటు చేస్తున్న ప్రసంగాలు ప్రపంచంలోని అనేక మందిని విస్మయపరిచేలా సాగాయనే చెప్పాలి. వీటికి తోడు వరుస ఆరోపణలు ముంచెత్తడంతో ఊహించని విధంగా హిల్లరీ క్లింటన్‌ అధ్యక్ష పీఠం వైపు దూసుకు పోవటం ట్రంప్‌ పరాజయం దాదాపు ఖాయమైపోయినట్లే కనిపిస్తోంది. డెమెక్రటిక్‌ల జాతీయ సదస్సుసైతం ఓ క్రమ పద్దతిన సాగటం, వివిధ ప్రాంతాలలో ఉన్న వారందరికీ ప్రాధాన్యత ఇస్తూ ప్రసంగాల తీరు ప్రధాన ఆకర్షణగా నిలచిందనే చెప్పకతప్పదు. ఈ క్రమంలో సిఎన్‌ఎన్‌, ఓఆర్‌సీ సంస్ధ నిర్వహించిన సర్వేలో మెజార్టీ ప్రజలు హిల్లరీకే మద్దతుగా నిలస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. గత మే నెలలో సర్వే నిర్వహించినప్పుడు హిల్లరీ క్లింటన్‌ 43 శాతానికి పరిమితమై పోగా, రిపబ్లికన్ల అభ్యర్ధి ట్రంప్‌ 52 శాతం పాయింట్లతో విజయతీరాలవైపు దూసుకెళ్లున్నట్లు కనిపించారు. అయితే ఇటీవల కొంత కాలంగా ట్రంప్‌ విదేశీ విధానాలపై, ఆర్ధిక రంగాలపై తను తీసుకోబోయే చర్యలు ఎలా ఉంటాయో ఇప్పటికే స్ధిరపడిన విదేశీయుల్ని కొంత కలవరానికి గురి చేసాయి. వీటికి మించి ట్రంప్‌ ముస్లి మైనార్టీలపై చేసిన వ్యాఖ్యలు పెద్ద చిచ్చే రేపాయి. చివరికి రిపబ్లికన్లే ఆతని వ్యవహారసైలిని తప్పుపట్టే పరిస్ధితి నెలకొనటం గమనార్హం. ఈ నేపధ్యంతో  ఈ నెలలో సిఎన్‌ఎన్‌ , ఓఆర్‌సీ సంస్ధ మరో మారు తాజా రాజకీయ పరిణామాలపై సర్వే చేపట్టి వివరాలు వెల్లడించింది. గతంలో కేవలం 43 శాతానికే పరిమితమై పోయిన హిల్లరీ అనూహ్యంగా 78 శాతానికి పెరిగారని, ఎన్నికల నాటికి ఇది 91 శాతానికి చేరినా ఆశ్చర్యపోనఖ్ఖర్లేదంటూ తన సర్వే నివేదికలో పేర్కొంది. జాతీయ సదస్సు తదుపరి శ్వేతజాతీయులతో పాటు నల్ల జాతీయులు సైతం హిల్లరీనే అధ్యక్షురాలు కావాలని కాంక్షిస్తున్నారని సర్వే సంస్ధ స్పష్టం చేసింది. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా హిల్లరీకి మద్దతు ప్రకటించడంతో ఇక విజయం తధ్యమన్న కథనాలు అమెరికా వర్తాపత్రికలలో హోరెత్తుతున్నాయి. ప్రస్తుత తన స్ధితికి తన ప్రసంగాలు నోటి దురుసు తనాలే కారణమని ట్రంప్‌ తెలుసుకుంటే మంచిదని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.