రావ‌ల్పిండిలో జ‌ర్న‌లిస్ట్ దారుణ హ‌త్య‌

murderfff
Journalist Murder

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌లోని రావల్పిండి గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో అంజుమ్‌ మున్నీర్‌ రాజా అనే జర్నలిస్టు మృతి చెందాడని మీడియా వర్గాలు తెలిపాయి. గురువారం రాత్రి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అతను బైక్‌పై ఇంటికి వెళుతుండగా కొంతమంది బైక్‌మీద వచ్చి కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన పాకిస్తాన్‌ సైనిక జాతీయ ప్రధాన కార్యాలయానికి కొద్ది దూరంలో బ్యాంకు రోడ్డులో జరిగిందని మీడియా తెలిపింది. రాజా తల, మెడ, శరీరంపై ఆరుసార్లు కాల్పులు జరిపారని అధికారి తెలిపారు. ఆయన ఉదయం పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తూ, సాయంత్రం వేళలో ఇస్లామాబాద్‌కు చెందిన ఉర్దూ దినపత్రికలో సబ్‌ ఎడిటర్‌గా పనిచేస్తున్నారని మేనమామ తరిఖ్‌ మహమ్మద్‌ తెలిపారు. తన మేనల్లుడికి ఎవరితోనూ వ్యక్తిగత ద్వేషాలు లేవని మహమ్మద్‌ తెలిపారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ప్రాంతంలో రాజా చనిపోవడం షాక్‌కు గురి చేసిందని పేర్కొన్నారు. పాత్రికేయుల సంఘం హత్యను ఖండించారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.