కాబూల్ దాడిలో మృతుల సంఖ్య 43

Continental Hotel
Continental Hotel

కాబూల్‌: అఫ్గాన్‌ రాజధాని కాబూల్‌లోని అత్యంత విలాసవంతమైన ఇంటర్‌ కాంటినెంటల్‌ హోటల్‌లో ఉగ్రవాదులు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. నలుగురు ముష్కరులు హోటల్‌లోకి చొరబడి విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో మృతుల సంఖ్య  43కి చేరింది. ఆదివారం ఉదయం ఆరుగురు చనిపోయారని.. వారిలో ఒకరు విదేశీ మహిళ ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. కానీ మృతుల సంఖ్య ఎక్కువగానే ఉంటుందని బాధితులు చెబుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని.. ప్రభుత్వ వర్గాలు మృతుల సంఖ్యను తక్కువగా చెబుతున్నాయని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు తెలిపాడు.హోటల్‌పై దాడికి తామే బాధ్యులమంటూ తాలిబన్లు ప్రకటించుకున్నారు. 12 గంటల పాటు భద్రతా బలగాలు పోరాడి హోటల్‌లోకి చొరబడిన నలుగురు ముష్కరులను హతమార్చారు. హోటల్‌లో బందీలుగా ఉన్న 150 మందిని భద్రతా బలగాలు సురక్షితంగా కాపాడాయి. వారిలో 41 మంది విదేశీయులు కూడా ఉన్నారు. ఈ దాడి జరిగిన గంటల వ్యవధిలోనే కాబూల్‌లోని మరో ప్రాంతంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. రోడ్డు పక్కన బాంబు అమర్చి 12 మంది పౌరుల ప్రాణాలను బలిగొన్నారు. ఈ దాడి కూడా తాలిబన్లే చేసి ఉంటారని అక్కడి పోలీస్‌ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.