అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిని ఎత్తేసిన మాల్దీవులు

Abdulla Yameen
Abdulla Yameen

మాలే: ద్వీప రాజ్యమైన మాల్దీవుల్లో అత్యవసర పరిస్థితిని ఎత్తేశారు. గత 45రోజులుగా దేశంలో కొనసాగుతోన్న అత్యయిక స్థితిని తొలగిస్తున్నట్లు అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్‌ అన్నారు. దేశంలో సాధారణ పరిస్థితులు నెలకోల్పేందుకు భద్రతా బలగాల సూచనల మేరకు అత్యయికస్థితిని తొలగించినట్లు యమీన్‌ కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. తన రాజకీయ ప్రత్యర్థులను కోర్టు ఆదేశాల మేకు విడుదల చేసేందుకు యమీన్‌ నిరాకరించడంతో మాల్దీవుల్లో రాజకీయ అనిశ్చితి తలెత్తిన విషయం విదితం. రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని, అనర్హత వేటు ఎదుర్కొంటున్న ఎంపీలను తిరిగి పదవుల్లోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును యమీన్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. తీర్పును అమలు చేసేందుకు నిరాకరించారు. ఈ క్రమంలో అధ్యోక్షుడికి సుప్రీం కోర్టుకు మధ్య వివాదం నెలకొంది. దీంతో యమీన్‌ దేశంలో అత్యవసర పరిస్థితిని విధించారు. అత్యయిక స్థితి సమయంలో మాజీ అధ్యక్షుడు అబ్దుల్‌ గయూమ్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అబ్దుల్లా సయీద్‌, మరో న్యాయమూర్తి అలీ హమీద్‌తో సహా నలుగురు శాసనకర్తలను అరెస్ట్‌ చేశారు. మాల్దీవుల్లో అత్యవసర పరిస్థితి కొనసాగుతుండటంపై పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేసిన విషయం విదితమే.