టాటాహోటల్స్‌కు సింగపూర్‌ జిఐసి పెట్టుబడులు

MD Puneeth
MD Puneeth


న్యూఢిల్లీ: ఆతిథ్యరంగంలో పేరెన్నికగన్న టాటాగ్రూప్‌ ఇండియన్‌ హోటల్స్‌ కంపెనీ విస్తరణ బాటపట్టింది. సింగపూర్‌కు చెందిన సావరిన్‌ వెల్త్‌ఫండ్‌ జిఐసితో కలిసి నాలుగువేల కోట్ల పెట్టుబడుల వేదికను ఏర్పాటుచేసుకుని విలాసవంతమైన, ఒకమోస్తరు నుంచి స్టార్‌ హోటళ్లను భారత్‌లో కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రణాళిక మూడేళ్లకాలంలో నెరవేరుస్తామని కంపెనీ ఎండి పునీత్‌ ఛాత్వల్‌ వెల్లడించారు. ముందు ఈక్విటీ రంగపరంగా 30శాతం కొనుగోలుతో ముందుకువస్తుంది. మిగిలిన 70శాతం జిఐసి పూర్తిచేస్తుంది. ఎండి చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ పునీత్‌ చాత్వాల్‌ మాట్లాడుతూ సింగపూర్‌సంస్థతో కలవడం వల్ల పెట్టుబడుల్లో వృద్ధి ఉంటుందని, అంతేకాకుండా గ్లోబల్‌స్థాయి ఇన్వెస్టర్‌తో జతకట్టినట్లయిందన్నారు. 2022 నాటికి తమ ప్రణాలకను పూర్తిచేసేదిశగా ఉంటుం దని ఈ కొనుగోళ్లు మూడేళ్లకాలంలోనే పూర్తిచేస్తా మని వెల్లడించారు. ఇండియన్‌ హోటల్స్‌ ప్రకట నను చూస్తే ఈ జాయింట్‌ ప్లాట్‌పామ్‌ దేశంలోని కీలకమైన లాడ్జింగ్‌లు ఉన్న మార్కెట్లపై దృష్టి పెట్టింది. పూర్తిస్థాయిలో కార్యకలాపాలు సాగిస్తున్న సంస్థలపైనే దృష్టిపెట్టింది. వాస్తవానికి టాటా గ్రూప్‌ ఇండియన్‌ హోటల్స్‌ ఈ కొత్త ప్రణాళికను 2018లోనే ప్రారంభించింది. ‘ఆకాంక్ష2022 వ్యూహాత్మకంగా ఆవిష్కరించింది. తన పన్నుల చెల్లింపులకు ముందున్న మార్జిన్లను మరింతగా మెరుగుపరుచుకునేందుకు ఈ ప్రణాళికను అమలుకుతెచ్చింది. ఇపుడున్న 17 శాతాన్ని 2022 నాటికి 25శాతానికి పెంచాలన్న లక్ష్యం కనిపిస్తోంది. ఇపుడున్న వాతావరణంలో ప్రతి గదికి వచ్చే రాబడి (రెవ్‌పార్‌) దేశీయ మార్కెట్లలో 2007-08స్థాయికి తీసుకువెళ్లాలని నిర్ణయించింది. ఇందుకోసం మూడంచెల వ్యూహాన్ని అమలుచేస్తున్నది. పునర్నిర్మాణం, పునర్‌ ఇంజనీరింగ్‌, పునఃచిత్రీకరణ వంటి మూడు విధానాలతో పోర్టుఫోలియో మార్చి వేస్తున్నట్లు చత్వాల్‌ వెల్లడించారు. 115 ఏళ్ల కంపనీగా ఉన్న ఇండియన్‌ హోటల్స్‌ తన రుణభారం స్థాయిని తగ్గించుకోగలిగింది. తన కీలకమైన స్థలాలను నగదీకరించడం లేదా కుదువపెట్టి రుణాలను తగ్గించింది. ప్రాధాన్యేతర ఆస్తులను విక్రయించడం ద్వారా తన లాభాల మార్జిన్లను పెంచుకుంది. ఇపుడు ప్రత్యేకించి ఒకే ఇండియన్‌ హోటల్స్‌ ఒకే టాటా అన్న వ్యూహంతో టాటాగ్రూప్‌ ఆతిథ్య విభాగం ముందుకువస్తోంది. ప్రస్తుతం ఉన్న 16 వేల గదుల సామర్ధ్యాన్ని 2022 నాటికి 24వేలకు పెంచాలన్న లక్ష్యం విధించింది. తమ బ్రాండ్లు తాజ్‌, వివంతా, జింజర్‌ బ్రాండ్ల రూపంలో మరింతగా విస్తరించేందుకు ఇండియన్‌ హోటల్స్‌ సింగపూర్‌ జిఐసితో చేతులు కలిపింది.