వారెవ్వా..రుపీ జోష్‌

ముంబై, :వరుసగా ఐదోరోజు దేశీయ కరెన్సీ జోరు చూపుతోంది. డాలరుతో మారకంలో ట్రేడింగ్‌ ప్రారంభంలోనే పెరిగింది. ఇంటర్‌బ్యాంకు ఫోరెక్స్‌ మార్కెట్లో 24 పైసలు పెరిగి రూ.69.10కు చేరింది. ఇది 2019లో గరిష్టం కాగా, ఇంతకు క్రితం 2018 ఆగస్టు 10న మాత్రమే రూపాయి ఈ స్థాయికి చేరింది. కాగా గురువారం కూడా రూపాయి 20 పైసలు పెరిగి 69.34వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 69.26వరకూ ర్యాలీతీసింది. ఈ దారిలోనే బుధవారం డాలరుతో మారకంలో రూపాయి 17పైసలు బలపడి 69.54వద్ద స్థిరపడింది. ఈ మధ్యకాలంలో కొద్ది రోజులుగా దేశీయ స్టాక్‌ మార్కెట్లు ర్యాలీబాటలో సాగుతున్నాయి. దీనికితోడు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు దేశీయ స్టాక్స్‌లో భారీగా పెట్టుబడులకు దిగుతున్నారు. మరోపక్క రిజర్వ్‌ బ్యాంకు ఒపెన్‌ మార్కెట్‌ లావాదేవీల ద్వారా వ్యవస్థలో లిక్విడిటీని పంప్‌చేస్తోంది. విదేశీ మారకం స్వాపింగ్‌ ద్వారా 5 బిలియన్‌ డాలర్లను వ్యవస్థలోకి విడుదల చేయనున్నట్లు గురువారం ఆర్‌బిఐ తెలియచేసింది. ఇలాంటి పలు సానుకూల అంశాలు రూపాయికి బలాన్నిస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో గత నాలుగు రోజుల్లో రూపాయి 80 పైసలు పెరిగింది. సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడిన నేపథ్యంలో ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు బలహీనంగా ఉన్నప్పటికీ దేశీయ స్టాక్‌ మార్కెట్లు జోరుగా కదులుతున్నాయి. దీనికి తోడు ఇటీవల దేశీయ స్టాక్స్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు భారీ పెట్టుబడులు చేపడుతుండటం రూపాయికి బలాన్నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఈ నెలలో ఇప్పటివరకూ ఎఫ్‌పిఐలు దేశీయ కేపిటల్‌ మార్కెటోల నికరంగా రూ.2700కోట్లు ఇన్వెస్ట్‌ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. దీనికితోడు ఓపెన్‌ మార్కెట్‌ద్వారా రిజర్వ్‌ బ్యాంకు కొద్ది రోజులుగా లిక్విడిటీని మెరుగుపరచడం కూడా రూపాయికి బలాన్నిచ్చినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

https://www.vaartha.com/news/business/
మరిన్ని తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి
: