ఆర్‌బిఐ పిసిఎతో లక్ష్మీవిలాస్‌బ్యాంక్‌ డౌన్‌

lakshmi vilas bank
lakshmi vilas bank

ముంబై: లక్ష్మీ విలాస్‌ బ్యాంకు (ఎల్‌విబి)పై దిద్దుబాటు చర్యలను ఆర్‌బిఐ ప్రారంభించడంతో ఈ బ్యాంకు షేరు క్షీణించి లోయర్‌ సర్క్యూట్‌ వద్ద ఫ్రీజయింది. లక్ష్మీ విలాస్‌ బ్యాంకు అధిక మొత్తంలో మొండి బకాయిలను కలిగివుండడంతోపాటు, మూలధనం తగినంత లేకపోవడం, వరుసగా రెండేళ్ల నుంచి ఆస్తులపై ప్రతికూల రాబడులను ఇవ్వడం వలన ఆర్‌బిఐ ఈ దిద్దుబాటు చర్యలను ప్రారంభించింది. దీంతో ఈ బ్యాంకు షేరు విలువ సోమవారం బిఎస్‌ఇ ట్రేడింగ్‌లో 5 శాతం నీరసించి రూ.34.75వద్ద లోయర్‌ సర్క్యూట్‌ పరిమితిని చేరుకుంది. కార్పొరేట్‌, ఒత్తిళ్లలో ఉన్న కంపెనీలు, రిస్క్‌ ఎక్కువగా ఉన్న రంగాలకు తప్ప మిగిలిన వారి కోసం బ్యాంకు రుణ కార్యకలాపాలు యథావిధంగా ఉంటాయని బ్యాంకు తెలిపింది. అంతేకాకుండా ఎన్‌పిఎలను రికవరీ చేయడానికి, ఖర్చులను కుదించడానికి, బ్యాంకు కేపిటల్‌ను పెంచడానికి, లాభదాయకతను మెరుగుపరచడానికి బ్యాంకు దిద్దుబాటు చర్యలను మొదలుపెట్టిందని లక్ష్మీ విలాస్‌ బ్యాంకు తెలియచేసింది. సిఎఆర్‌ఎఆర్‌ పెంచడం కోసం, కేపిటల్‌ను పెంచే వివిధ మార్గాలను అన్వేషిస్తున్నట్లు ఈ బ్యాంకు పేర్కొంది. పిసిఎ అంటే తాత్కాలికంగా బ్యాంకు కార్యకలాపాలను మూసివేయడం కాదని, బ్యాంకు సాధారణ కార్యకలాపాలను కొనసాగించగలదని ఎల్‌విబి బిఎస్‌ఇ ఫైలింగ్‌లో పేర్కొంది. కాగా లక్ష్మీ విలాస్‌ బ్యాంకును విలీనం చేసుకుందామని ప్రయత్నించిన ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేరు విలువ సోమవారం ట్రేడింగ్‌లో 12 శాతం నష్టపోయి ఏడాది కనిష్టమై రూ.342.70కు క్షీణించింది. ఆర్‌బిఐ ఒప్పుకుంటే ఇండియా బుల్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ సమీర్‌ గెహ్లట్‌ విలీన సంస్థకు చైర్మన్‌గా ఉండరని, అదేవిధంగా బోర్డు స్థానం కూడా కలిగి ఉండరనే సంకేతాలను ఇండియా బుల్స్‌ గ్రూప్‌ ఇవ్వడం విశేషం.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/business/