కేంద్రాన్ని రెండేండ్లు గడువు కోరిన ఐడియా వొడాఫోన్

IDEA, VODAFONE
IDEA, VODAFONE

టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా ఇటీవల విలీనమైన సంస్థ భారీ అప్పులతో సతమతమవుతున్నదని, ముఖ్యంగా బ్యాలెన్స్ షీట్ అంతంత మాత్రంగా ఉండటంలో ప్రస్తుత సంవత్సరానికిగాను పది వేల కోట్ల రూపాయలను చెల్లించడానికి మరో రెండేండ్లు అవకాశం ఇవ్వాలని టెలికం డిపార్ట్‌మెంట్‌ను అభ్యర్తించినట్లు ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత అంచనాప్రకారం వొడాఫోన్ ఐడియా ఈ ఏడాదికిగాను రూ.10 వేల కోట్ల మేర చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ..130 కోట్ల మంది భారతీయులకు డిజిటల్ సేవలు అందించడం టెలికం రంగ సంస్థలకు చాలా క్లిష్టమైన సమస్యని, పలు సంస్థలు సేవలు అందిస్తుండటంలో ఏ సంస్థనైనా ఎన్నుకునే అవకాశం వినియోగదారుడికి ఉంటుందని, ఇదే సమయంలో సంస్థల మధ్య పోటీ రోజురోజుకు పెరుగుతుండటంతో స్పెక్ట్రం కోసం అధికంగా నిధులు వెచ్చించాల్సి వస్తున్నదన్నారు.ప్రస్తుతం దేశీయ టెలికం ఇండస్ట్రీ ఆర్థిక ఒత్తిడిలో కొట్టుమిట్టాడుతున్నది. వొడాఫోన్, ఐడియాలు 2010, 2012, 2014, 2015, 2016లో విలీనం కంటే ముందు నిర్వహించిన స్పెక్ట్రం వేలం పాటలో పాల్గొన్నది. ఈ ఐదు వేలంపాటలో వొడాఫోన్ రూ.79,343 కోట్ల విలువైన స్పెక్ట్రాన్ని కొనుగోలు చేయగా, ఇదే సమయంలో ఐడియా రూ.63,597 కోట్లు కొనుగోలు చేసింది. దీర్ఘకాలికంగా టెలికం రంగం నిలకడైన వృద్ధిని సాధించాలంటే కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా నగదు సరఫరాను మెరుగుపరుచాలని ఇటీవల వొడాఫోన్ ప్రతినిధి సూచించారు. రూ.7.8 లక్షల అప్పులు ఉండటంతో టెలికం రంగ సంస్థలను ఆదుకోవడానికి స్పెక్ట్రం చెల్లింపులను 10 ఏండ్ల నుంచి 16 ఏండ్లకు పెంచింది.