ప్రపంచవ్యాప్తంగా బ్రిటిష్ ఎయిర్‌వేస్‌కు సమ్మె సెగ

British Airways
British Airways

లండన్: బ్రిటిష్ ఎయిర్‌వేస్‌కు మొట్టమొదటిసారి సమ్మె సెగ తాకింది. బ్రిటిష్ ఎయిర్‌వేస్‌కు చెందిన దాదాపు 4,300కి పైగా పైలట్లు సోమవారం ప్రపంచవ్యాప్తంగా సమ్మె చేపట్టారు. దీంతో సుమారు 3 లక్షల మంది ప్రయాణికులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకునే పరిస్థితి తలెత్తింది. బ్రిటిష్ ఎయిర్‌వేస్‌లో వేతనాల పెంపుపై తొమ్మిది నెలలుగా కొనసాగుతున్న వివాదం చివరకు పైలట్ల సమ్మెకు దారితీసింది. బ్రిటిష్ ఎయిర్‌లైన్ పైలట్స్ అసోసియేషన్ గత నెల మూడు రోజుల సమ్మెకు నోటీసు ఇచ్చింది. బ్రిటిష్ ఎయిర్‌వేస్ పైలట్లు సమ్మెకు దిగడం చరిత్రంలో ఇదే మొదటిసారి. సెప్టెంబర్ 9, 10 తేదీలతోపాటు సెప్టెంబర్ 27న మూడు రోజులు సమ్మె చేపట్టనున్నట్లు పైలట్ల సంఘం తమ నోటీసులో పేర్కొంది. సమ్మెను నివారించడానికి ఉభయ పక్షాలతో చర్చలు జరిపేందుకు బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రభుత్వం గత శుక్రవారం ప్రతిపాదించింది. కాగా, సమ్మెకు దిగితే పైలట్లకు, వారి కుటుంబాలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని రద్దు చేస్తామని బ్రిటిష్ ఎయిర్‌వేస్ హెచ్చరించింది. ఇదిలా ఉంటే, పైలట్లకు మూడేళ్ల కాలానికి 11.5 శాతం వేతన పెంపును పైలట్ల సంఘం వ్యతిరేకిస్తోంది.