నాన్‌ వర్కింగ్‌ డేస్‌ ప్రవేశపెట్టిన అశోక్‌లేలాండ్‌

ashok leyland
ashok leyland


న్యూఢిల్లీ: హిందుజా గ్రూప్‌ సంస్థ అశోక్‌లేలాండ్‌ భారీ వాహనాలు, బస్సులు, లారీలను తయారుచేసే కంపెనీల్లో రెండో అతిపెద్ద సంస్థ అయిన ఈ కంపెనీ కూడా ఆర్థిక మాంద్యం దెబ్బకు ఇబ్బందులుపడుతోంది. ఇటీవల తమ ఉత్పత్తులకు డిమాండ్‌ తగ్గడంతో, ఏం చేయాలో తెలియక సతమతమవుతోంది. ఖర్చులు పెరుగుతున్నాయి, ఉద్యోగులకు వేతనాలు ఇతరత్రా చెల్లించాల్సిందే కదా. అందువల్ల ఎలాగైనా సమస్య నుంచీ గట్టెక్కాలనీ ఆలోచించి, తనకు సంబంధించిన ఐదు యూనిట్లలో నాన్‌ వర్కింగ్‌ డేస్‌ ప్రవేశపెట్టింది. ఈ నెలలోనే ఈ నిర్ణయం అమల్లోకి తెచ్చింది. ఇందుకు సంబంధించి ఒక ప్రకటన విడుదల చేసింది. దాని ప్రకారం ఎన్నోర్‌ ప్లాంట్‌లో ఈ నెలలో 16 నాన్‌ వర్కింగ్‌ డేస్‌ ప్రకటించింది. అలాగే హోసూర్‌ 1,2 ప్లాంట్లు, సిపిపిఎస్‌లో ఐదు రోజులు, అళ్వార్‌, భండారా ప్లాంట్లలో 10 రోజులు, పంత్‌నగర్‌ ప్లాంట్‌లో ఏకంగా 18 రోజులు నాన్‌ వర్కింగ్‌ డేస్‌ ప్రకటించింది. అశోక్‌ లేలాండ్‌ బిజినెస్‌ 28శాతం క్షీణించింది.

గతేడాది జులైలో 15,199వాహనాలు విక్రయించగా, ఈ ఏడాది జులైలో 10,927మాత్రమే విక్రయించింది. దేశీయంగా బిజినెస్‌ 29 శాతం పడిపోయింది. మీడియా, హెవీ కమర్షియల్‌ వాహనాలు, లైట్‌ కమర్షియల్‌ వాహనాలు ఇలా అన్ని రకాల వాహనాల అమ్మకాలు తగ్గాయి. అయితే మైనింగ్‌ రంగంలో ట్రక్కులకు డిమాండ్‌ మళ్లీ పెరిగే అవకాశముందని, దేశంలోనే హెవీ కమర్షియల్‌ వాహనాలు తయారుచేసే రెండో అతిపెద్ద కంపెనీగా అశోక్‌లేలాండ్‌ అభిప్రాయపడింది. అయితే నాన్‌వర్కింగ్‌ డేస్‌ ప్రకటనతో స్టాక్‌ మార్కెట్లో అశోక్‌లేలాండ్‌ షేరు 1.10శాతం క్షీణించి ప్రస్తుతం రూ.63.20గా కొనసాగుతోంది. అయితే 2019 ఆగస్టు 23న కంపెనీ షేరు విలువ ఏడాది కనిష్టానికి చేరి, రూ.56.95గా పలికింది. మొత్తంగా అశోక్‌లేలాండ్‌ ప్రకటన కంపెనీ ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.https://www.vaartha.com/news/national/