22% క్షీణించిన టెలికాం రాబడి

TELECOM
TELECOM

న్యూఢిల్లీ: టెలికాం కంపెనీలనుంచి ప్రభుత్వానికి రాబడులు 22శాతం తగ్గినట్లు తేలింది. గత ఆర్ధికసంవత్సరంలో టెలికాం రంగంలో అనుమతులిచ్చిన కంపెనీలద్వారా రాబడులు భారీగా తగ్గాయి. టెలికాం సేవల కంపెనీలు రాబడులు కూడా తగ్గడమే ఇందుకుకారణమని ఆశాఖ చెపుతున్నది. ప్రభుత్వం టెల్కోలనుంచి లైసెన్సుఫీజురూపేణా కొంత, స్పెక్ట్రమ్‌ వినియోగఛార్జిలకింద మరికొంత వసూలుచేస్తుంది. టెలికాం సేవల విక్రయంద్వారానే ఈ సుంకాలను రాబడుటుంది. సర్దుబాటుచేసిన స్థూల రాబడి కింద స్పెక్ట్రమ్‌ వినియోగఛార్జి రాబడులు సర్దుబాటు రాబడులతోపోలిస్తే తక్కువగానే ఉందని కేంద్ర టెలికాం మంత్రి మనోజ్‌సిన్హా వెల్లడించారు. 2017-18 సంవత్సరంలో పరిశ్రమ సర్దుబాటు రాబడులు 18.62శాతం క్షీణించి రూ.1,30,844.9 కోట్లకు చేరింది. అంతకుముందు ఆర్ధిక సంవత్సరంలో రూ.1,60,787.9 కోట్లుగా ఉంది. ఇక లైసెన్సుఫీజులరూపంలో ప్రభుత్వ రాబడులు 18.12వాతం దిగజారి రూ.10,670.6కోట్లకు చేరింది. అంతకుముందు 2016-17లో 13,032.9 కోట్లుగా ఉన్నట్లు అంచనా. అంతేకాకుండా స్పెక్ట్రమ్‌ వినియోగఛార్జిల్లో కూడా తగ్గుదలనమోదయింది. ఈఛార్జిలు 29శాతం తగ్గాయి. 2017-18లో రూ.4983.75 కోట్లకు పడిపోయాయి. అంతకుముందు సంవత్సరంలో రూ.7048 కోట్లుగా ఉందని టెలికాం శాఖ మంత్రి చెపుతున్నారు. వీటికితోడు టెలికాం రంగంలో పెరిగిన అవాంఛిత పోటీవల్ల కొన్ని కంపెనీలు మూసివేత దిశగా వెళుతున్నాయి. మరికొన్నింటిని పెద్ద కంపెనీలు కొనుగోలుచేస్తున్నాయి. ఈకారణంగా అసలు టెల్కోలు చెల్లించాల్సిన యూసేజి ఛార్జిలు,లైసెన్సురూపంలో చెల్లించాల్సిన మొత్తాలను బకాయిలో పెడుతున్నాయి. అత్యధికంగా టెలికాం రంగంలో ఈ బకాయిలే ఎక్కువ కనిపిస్తున్నాయి.