హెచ్‌పిసిఎల్‌ ప్రభుత్వ వాటా ఎన్‌జిసి కొనుగోలు

ONGC
ONGC

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని ఒఎన్‌జిసి హిందూస్థాన్‌ పెట్రోలియంకార్పొరేషన్‌లోని 51.11 శాతం వాటాలను 36,915 కోట్లకు కొనుగోలుచేస్తోంది. ఒఎన్‌జిసి ప్రభుత్వానికి ఒక్కొక్కవాటాధర 473.97 రూపాయలుగా చెల్లిస్తుంది. ప్రస్తుత ధరపై పదిశాతం ప్రీమియంతోపాటు 60 రోజుల వేచిచూసే సగటు ధరలప్రకారం ఈ కొనుగోలుచేస్తున్నట్లు వెల్లడించింది. స్టాక్‌ఎక్ఛేంజిలకు ఈమేరకు ఒఎన్‌జిసి నివేదికలు అందచేసింది. నగదురూపంలోనే వాటాలను కొనుగోలుచేస్తుందని, ఈనెలాఖరుకల్లా ఈ లావాదేవీలు పూర్తవుతాయని ఒఎన్‌.జిసి వెల్లడించింది. సంస్థ వాటాలు బిఎస్‌ఇలో 193.60 రూపాయలవద్ద ముగిసాయి. అంతకుముందురోజు ముగింపుకంటే 0.23శాతం క్షీణించాయి. హెచ్‌పిసిఎల్‌ వాటాలు మాత్రం రూ.416.55చొప్పున ట్రేడ్‌ అయ్యాయి. 1.34శాతంపెరిగినట్లు అంచనా. హెచ్‌పిసిఎల్‌లో ఉన్న ప్రభుత్వ వాటాను మొత్తం ఒఎన్‌జిసి కొనుగోలుచేసినట్లవుతుంది. ఒఎన్‌జిసి ఈ కొనుగోలులో 14శాతంప్రీమియం ధరలు చెల్లిస్తుందని అంచనా. జనవరి మాసాంతానికే ఈ డీల్‌ పూర్తిచేస్తుంది. ప్రభుత్వానికి ఈ డీల్‌ద్వారా రూ.37వేల కోట్లు నిధులు అందుతాయి. ఆర్ధికలోటు ఇప్పటికే రూ.6.12లక్షలకోట్లకు చేరింది. బడ్జెట్‌ అంచనాల్లో 112శాతానికి చేరిందని గతంలోనే ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం ఈ కొనుగోళ్లద్వారా ప్రభుత్వానికి నిధులు అందుతుండటంతో లోటును కట్టడిచేసే అవకాశం ఉంటుందని అంచనా. లోటు కట్టడికి ఇప్పటికే మార్కెట్లనుంచి రూ.50వేల కోట్లు నిధులు సమీకరించాలని సైతం ప్రభుత్వం నిర్ణయించింది. తదనంతరంప్రభుత్వం తన అవసరాలను రూ.20వేల కోట్లకు కుదించింది. పెట్టుబడుల ఉపసంహరణశాఖలో కీలక గ్రూప్‌ కార్యదర్శులు కేబినెట్‌ కార్యదర్శి ఆధ్వర్యంలో ఒఎన్‌జిసి హెచ్‌పిసిఎల్‌లోని ప్రభుత్వ వాటాను కొనుగోలుచేసేందుకు ప్రతిపాదించారు. దీనివల్ల దేశంలోనే భారీ సంస్థను అంటే అంతర్జాతీయ స్థాయిసంస్థను ఏర్పాటుచేసే ప్రభుత్వ లక్ష్యం సైతం నెరవేరినట్లవుతుంది. దీపమ్‌ లక్ష్యాలను చూస్తే ఈనెల రెండవ తేదీనాటికి ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ విభాగంలో 32,321.92కోట్ల రూపాయలు సమీకరించింది. లక్ష్యం రూ.46,500కోట్లుగా ఉంది. రూ.4153.65 కోట్లు వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యంద్వారా సాధించింది. వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణలో రూ.15వేల కోట్ల లక్ష్యం విధించిన సంగతి తెలిసిందే. ఇకబీమాకంపెనీలు ఐపిఒద్వారా రూ.11వేల కోట్లు సమీకరిస్తాయి. ప్రభుత్వం ఇప్పటికే 17,357.48 కోట్లు నిధులు సమీకరించగలిగింది. మొత్తంపెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యంలో భారత్‌ 58,833.05 కోట్లు సమీకరించినట్లయింది. అంటే 74శాతం లక్ష్యాలను చేరుకుంది. ఇక ఒఎన్‌జిసిపరంగాప్రభుత్వరంగంలో అతిపెద్ద చమురుగ్యాస్‌ అన్వేషణ సంస్థగా నిలిచింది. భారత దేశీయ ఉత్పత్తిలో 70శాతం ఉత్పత్తిచేస్తోంది. ఒఎన్‌జిసి మార్కెట్‌ విలువలు జనవరి 19వ తేదీనాటికి 248451కోట్లుగా ఉన్నాయి. ఒఎన్‌జిసి గ్రూప్‌ మొత్తంగా 61.60 మిలియన్ల టన్నుల ముడిచమురు, చమురుసంబంధిత గ్యాస్‌ను అదే మొత్తానికి ఉత్పత్తిచేసింది. మొత్తం సంఘటిత టర్నోవర్‌ 1,42,149 కోట్లుగా ఉంది. నికరలాభం గత ఏడాది 20,498 కోట్లు ఆర్జించింది. సంస్థపరంగా మొత్తం చమురుగ్యాస్‌ రిజర్వులు 2142 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులుగా ఉన్నట్లు సంస్థ అంచనా.