స్వ‌ల్ప లాభాల‌తో స‌రిపెట్టుకున్న మార్కెట్లు

stock market
stock market

ముంబైః అంతర్జాతీయ సంకేతాలతో సోమవారం భారీ లాభాలను ఆర్జించిన స్టాక్‌మార్కెట్లు మంగళవారం మాత్రం ఫ్లాట్‌గా ముగిశాయి. మదుపర్ల అప్రమత్తతతో ఆద్యంతం ఊగిసలాడిన సూచీలు చివరకు స్వల్ప లాభాలను సొంతం చేసుకున్నాయి. సెన్సెక్స్‌ 8 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ స్వల్పంగా 2 పాయింట్లు ఆర్జించింది. ఇరాన్‌ డీల్‌పై మరికొద్ది గంటల్లో నిర్ణయం వెల్లడిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. దీంతో ఈ నిర్ణయంపై దృష్టి పెట్టిన మదుపర్లు అప్రమత్తత పాటించారు. ఈ నేపథ్యంలో సూచీలు ఒడుదొడుకులను ఎదుర్కొన్నాయి. రోజంతా ఇదే ఊగిసలాటలో కొనసాగిన సూచీలు చివరకు స్వల్ప లాభాలను దక్కించుకున్నాయి. మంగళవారం మార్కెట్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 8 పాయింట్ల లాభంతో 35,216 వద్ద, నిఫ్టీ 2 పాయింట్ల లాభపడి 10,718 వద్ద స్థిరపడ్డాయి.