స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులకు విదేశీ మదుపరులు దూరం

stock exchange
stock exchange

న్యూఢిల్లీ: భారతీయ స్టాక్‌ మార్కెట్లకు వివిధ దేశాలకు చెందిన పోర్ట్స్‌లియో లేదా సంస్థాగత మదుపరులు(ఎఫ్‌పిఐ) నెమ్మదిగా దూరమైపోతున్నారు.ఈ నెలలో ఇప్పటి వరకు స్టాక్‌ మార్కెట్‌ నుంచి సుమారు 3,000 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు తరలిపోవడమే దీనికి నిదర్శనం దేశీయంగా ఉన్న పలు ఆందోళనతో పాటు అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న విపత్కర పరిస్థితుల మధ్య విదేశీ మధుపరులు స్టాక్‌ మార్కెట్లలో పెట్టుబడులకు దూరంగా ఉంటున్నారు.అయితే రుణ మార్కెట్లలోకి మాత్రం ఇదే సమయంలో 2,700 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు రావడం గమనార్హం.స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులకు ప్రస్తుతం రక్షణ లేదనే అభిప్రాయానికి వచ్చిన ఎఫ్‌పిఐలు రుణ మార్కెట్లలోకి వాటని తరలిస్తున్నారు.మరోవైపు ఈ సంవత్సరం ప్రథమార్థంలో ఏకంగా 23 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి.గత సంవత్సరం జనవరి-జూన్‌ మధ్య కేవలం 1.2 బలియన్‌ డాలర్ల (7,600 కోట్ల రూపాయలు) పెట్టుబడులే వచ్చాయి.కాగా ఈ సంవత్సరం జనవరి మినహా,ఫిబ్రవరి నుంచి పెట్టుబడులు వెల్లువెత్తుతూనే ఉన్నాయి.ఫిబ్రవరి-జులై మధ్య దేశీయ రుణ మార్కెట్లలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువ 1.16 లక్షల కోట్ల రూపాయలు ఉంది.జనవరిలో 2,300 కోట్ల రూపాయల పెట్టుబడుల ఉప సంహరణ జరిగింది.అలాగే జనవరిలో దేశీయ స్టాక్‌ మార్కెట్ల నుంచి 1,200 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు వెనక్కిపోగా,ఫిబ్రవరి -జులై మధ్య 62,000 కోట్ల రపాయల పెట్టుబడులను పట్టుకొచ్చారు. అయితే గత నెల ఆగస్టులో మాత్రం 12,700 కోట్ల రూపాయల పెట్టుబడులను భారతీయ స్టాక్‌ మార్కెట్ల నుంచి విదేశీ మదుపరులు లాగేసుకున్నారు.ఉత్తర కొరియా భయాలు విదేశీ మధుపరుల పెట్టుబడులను దెబ్బతీస్తున్నాయని నిపుణులు పెట్టబడుల సరళిని విశ్లేషిస్తున్నారు.