శాంసంగ్‌ను వెన‌క్కునెట్టి షియోమి ముందుకు..

xiaomi redmi
xiaomi redmi

న్యూఢిల్లీః చైనా మొబైల్‌ మేకర్ షియోమి భారత్‌లో తన స‌త్తాను చాటుకుంది. భారతీయ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో వేగంగా దూసుకుపోతూ కొరియా మొబైల్‌ దిగ్గజం శాంసంగ్‌కు కోలుకోలేని షాక్‌ ఇచ్చింది. 17శాతం వార్షిక వృద్ధితో 27శాతం మార్కెట్‌ వాటాను కొల్లగొట్టి శాంసంగ్‌ను వెనక్కి నెట్టేసింది. నాలుగు సంవత్సరాల వ్యవధిలోనే తన సత్తా చాటిన షియోమి ర్యాంకింగ్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఆక‌ర్షణీయమైన డివైస్‌లతో భారతీయ వినియోగదారులను మెప్పించింది. ముఖ్యంగా రెడ్‌ మి సిరీస్‌ స్మార్ట్‌ఫోన‍్లతో స్టార్‌ ప్లేయర్‌గా నిలిచింది. మూడవ త్రైమాసికంలో శాంసంగ్‌, షావోమి రెండూ 23.5 శాతం మార్కెట్‌ వాటాతో టాప్‌ ర్యాంక్‌కు నువ్వానేనా అన్నట్టు పోటీపడినా, క్యూ4లో మాత్రం షియోమి శాంసంగ్‌ను అధిగమించింది. అయితే ఇప్పటివరకు భారత్‌లో అగ్రస్థానంలో ఉన్న శాంసంగ్‌ తన ర్యాంక్‌ను నిలుపుకోవడంలో విఫలమైంది. కేవలం 7.3 మిలియన్ స్మార్ట్‌ఫోన్లతో (25 శాతం వాటా) రెండవ స్థానంలో నిలిచిందని తెలిపింది. బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్లు మాత్రమే కాకుండా.. దేశంలోఇటీవల షియోమి షోం రూంలను ప్రారంభించడం కూడా కీలకమైన పరిణామమని పేర్కొంది. మొత్తంమీద భారతీయ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ 6 శాతం పుంజుకోగా మొత్తం యూనిట్లు 30 మిలియన్లుగా నమోదయ్యాయి. అలాగే వివో, ఒప్పో, లెనోవో ఈ జాబితాలో తరువాత స్థానాల్లో నిలిచాయి.