వోల్వోధరలు పెంపు!

VOLVO
VOLVO

న్యూఢిల్లీ: స్వీడిష్‌ కార్ల కంపెనీ వోల్వో తన కార్లన్నింటి ధరలను 5శాతం మేర పెంచనున్నట్లు ప్రకటించింది. 2018 కేంద్ర బడ్జెట్‌లో దిగుమతి సుంకాన్ని పెంచినందునే తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొంది. 2018 బడ్జెట్‌లో కేంద్రం సికెడి, సిబియు దిగుమతులపై కస్టమ్స్‌ డ్యూటీని 5శాతం పెంచింది. దీంతో సికెడి దిగుమతులపై విధించే పన్ను 15శాతం, సిబిఐ దిగుమతులపై విధించే పన్ను 25శాతం పెరిగాయి. ప్రస్తుతం దేశంలో ఉన్న వోల్వో కార్లన్ని సికెడి, సిబియు విభాగానికి చెందినవే కావడంతో వీటి ధరలు కూడా విపరీతంగా పెరగబోతున్నాయి. ధరలు పెరిగాయి కదానీ, వినియోగదారులేమీ బాధపడాల్సన పనిలేదని, పాత ధరల్లోనే ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న కారును కొనుగోలు చేసుకోవచ్చని తెలిసింది. ఈ పెరిగిన ధరలు కేవలం భారత్‌లోకి దిగుమతి అయ్యే కొత్త మోడల్‌ కార్లకే వర్తిస్తాయని కంపెనీ తెలిపింది. రానున్న కాలంలో మెర్సిడెస్‌ బెంజ్‌ జిఎల్‌ఎ, బిఎమ్‌డబ్ల్యూ, ఆడిక్యూ3 మాదిరిగానే భారత్‌లో వోల్వో తన ఎస్‌యువి, యక్స్‌సి40లను కూడా ప్రారంభించనుంది.
ఫోర్డ్‌, స్కోడాలు కూడా….
దిగుమతి సుంకాలు పెరిగిన నేపథ్యంలో ఫోర్డ్‌, స్కోడా కంపెనీలు కూడా వాటి కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. స్కోడా ఒక్కసారిగా కాకుండాదశల వారీగా ఒకశాతం నుంచి ధరలను పెంచుతోంది. ఫోర్డ్‌ ఎప్పటి మాదిరిగానే తన కార్ల ధరలను మార్చి1 నుంచి 4 శాతం మేర పెంచనున్నట్లు తెలిపింది.