వారమంతా మార్కెట్లకు లాభాలే

BSE
BSE

వారమంతా మార్కెట్లకు లాభాలే

ముంబై, నవంబరు 26: దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారంతో ముగిసిన వారంలో చెప్పుకోదగ్గ లాభాలను ఆర్జించింది. కొన్ని దేశీయ సానుకూల సంకేతాలతో పాటు బలమైన అంత ర్జాతీయ కారణంగా వారమంతా కూడా ప్రధాన సూచీలు రెండూ లాభాల్లో కొనసాగాయి. వాస్తవంగా చూస్తే ఏడురోజులు వరుసగా ఈ రెండు సూచీలు లాభాల్లో కొనసాగాయి. ఫలితంగా బిఎస్‌ఇ సెన్సెక్స్‌ క్రితం వారం 336.44పాయింట్లు లాభపడి 33,679.24పాయింట్లవద్ద ముగియగా, జాతీయ స్టాక్‌ ఎక్ఛేంజ్‌ సూచి నిఫ్టీ సైతం 106పాయింట్లు లాభపడి 10,389.70పాయింట్ల వద్దముగిసింది. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్‌ సూచి సైతం 1.56శాతం లాభపడగా, స్మాల్‌క్యాప్‌ సూచి 2.38 శాతానికి పైగా లాభపడింది.

వారం ప్రారంభం రోజైన సోమవారం నాడు స్వల్పలాభాలతో మొదలైన ప్రయా ణం చివరి వరకు అదే ఊపులో కొనసాగింది. మంగళ వారం బలమైన అంతర్జాతీయ సంకేతాల కారణంగా సెన్సెక్స్‌ ఏకంగా 118పాయింట్లకు పైగా లాభపడి, నవంబరు 6 తర్వాత గరిష్టస్థాయికి చేరుకుంది. బుధవారం కూడా దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంచి లాభాలను ఆర్జించాయి.

సెన్సెక్స్‌ 53పాయింట్లు లాభపడింది. ఇక సెన్సెక్స్‌లోని కంపెనీల వారీగా చూసినట్లయితే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు ఏకంగా 4.38శాతం వృద్ధిచెంది మొత్తం వారంలో భారీ లాభాలు ఆర్జించిన స్టాక్స్‌లో అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు ఇంజినీరింగ్‌ దిగ్గజం ఎల్‌అండ్‌టి షేరు 0.41శాతం పడిపోయింది. ఐటి షేర్లలో ఇన్ఫోసిస్‌ 4.02శాతం వృద్ధి చెందగా విప్రో 0.75శాతం పతనమైంది.

అయితే కంపెనీ రూ.11వేల కోట్ల షేర్ల బైబ్యాక్‌ ఆఫర్‌ ఈ నెల 29న ప్రారంభమై డిసెంబరు 13వరకు కొనసాగనున్న నేపథ్యంలో వచ్చేవారం ఈ స్టాక్‌ పుంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మరో ఐటి దిగ్గజం టిసిఎస్‌ కూడా 0.79శాతం దాకా నష్టపోయింది. హెల్త్‌కేర్‌ రంగంలో సిప్లా షేరు 1.2శాతం లాభపడగా, డాక్టర్‌ రెడ్డీస్‌ షేరు 1.13శాతం పతనమైంది.

టెలికాం రంగంలో భారతీఎయిర్‌టెల్‌ 0.5శాతం లాభపడింది. స్థూలంగా చూసినట్లయితే గురువారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దివాలా కోడ్‌ సవరణ ఆర్డినెన్స్‌ మార్కెట్‌పై చాలా వరకు ప్రభావం చూపించిందని చెప్పవచ్చు. మరోవైపు అమెరికా మార్కెట్లు సైతం గతవారం లాభాల్లో కొనసాగడం ఐటి షేర్లకు బాగానే కలిసి వచ్చింది. అయితే దాదాపు అన్ని రంగాల షేర్లు గరిష్టస్థాయి చేరుకున్న నేపథ్యంలో వచ్చేవారం అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశాలు లేకపోలేదని నిపుణులు అంటున్నారు.