రైతు రుణమాఫీలు రాష్ట్రాలే భరించాలి

Jaitley
Jaitley

రైతు రుణమాఫీలు రాష్ట్రాలే భరించాలి

న్యూఢిల్లీ,జూన్‌ 21: దేశంలో వివిధ రాష్ట్రాల్లో అమలవుతు న్న రైతురుణమాఫీలు రాష్ట్రాలే భరించాలని, కేంద్రం మాత్రం ఆర్థిక లక్ష్యాలకు కట్టుబడి పనిచేస్తుందని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టంచేశారు. పంజాబ్‌ రాష్ట్రంలో కూడా రుణమాఫీని అమలుచేస్తున్నట్లు ప్రకటిం చడంతో రైతు రుణమాఫీపై కేంద్రమంత్రి మరింత స్పష్టత నిచ్చారు. దేశంలో ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్రల తర్వాత మూడోరాష్ట్రంగా పంజాబ్‌ రైతురుణమాఫీని అమలుచేస్తుందని ప్రకటించింది. కేంద్రం ఎలాంటి ప్రతిపాదనలను ఆమోదించడంలేదని, 2008లోనే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రుణాలను సుమారు 74 వేల కోట్ల రూపాయలవరకూ మాఫీచేసిందని వెల్లడించారు. ఆర్థిక లక్ష్యా లకు కట్టుబడి పనిచేయాలని, ఆర్థికలోటును పరిరక్షిస్తుందన్నా రు.

అయితే రాష్ట్రాలు అమలుచేస్తున్న రుణమాఫీలపై తాను వ్యాఖ్యానించలేనన్నారు. గతవారంలోనే తాను స్పష్టంచేశాన న్నారు. ఈనెల12వ తేదీనే జైట్లీమాట్లాడుతూ కేంద్రం ఎలాంటి రుణమాఫీలకు తోడ్పాటునందించబోదని, రాష్ట్రాలే ఈ భారం భరించాలని వెల్లడించారు.రాష్ట్రాలు సొంతనిధులు సమకూర్చు కోవాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే రాష్ట్రాలకు తాము స్పష్టం చేశామన్నారు. ఇలాంటి రుణమాఫీ పథకాల వల్ల ఆర్థిక క్రమశిక్షణ దెబ్బతింటుందని, రుణాల ఎగవేత మరింతగా పెరుగుతుందని ఆయన వెల్లడించారు. ఇప్పటికే బ్యాంకర్లు రుణమాఫీలపై దుమ్మెత్తిపోస్తున్నాయి. రిజర్వుబ్యాంకు గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ సైతం రాష్ట్రాలే బడ్జెట్‌లలో సొంత వనరులు సమకూర్చుకోవాలని సూచించారు. రాష్ట్రాలు సొంత వనరుల నుంచే సమకూర్చుకోవాలని మాఫీపరంగా కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందబోదన్నారు.

====