రూ.10వేల మార్కును దాటిన ‘మారుతి!

maruti
maruti

ముంబై: 2003లో కేంద్ర ప్రభుత్వం మారుతి సుజుకీలో తమకున్న 25శాతం వాటాను విక్రయానికి పెట్టింది. షురుకి రూ.125 ధరలో పబ్లిక్‌ ఇష్యూ ద్వారా వీటిని విక్రయించింది. 2003 జూలై 9న మారుతి తొలిసారి స్టాక్‌ ఎక్ఛేంజీలలో లిస్టయింది. ఇష్యూ ధరతో పోలిస్తే 32శాతం లాభంతో రూ.164వద్ద తొలి రోజు ట్రేడయ్యింది. అప్పటినుంచీ ఈ కౌంటర్‌ బుల్‌ దౌడు తీస్తూ వచ్చి ప్రస్తుతం రూ.10,000మార్క్‌ను అందుకుంది. అంటే దాదాపు8,000శాతం దూసుకెళ్లింది. దీంతో కంపెనీ మార్కెట్‌ కేపిటలైజేషన్‌ కూడా తొలిసారి రూ.3లక్షల కోట్లను దాటింది. వెరసి అత్యంత విలువైన కంపెనీల జాబితాలో 5వ ర్యాంకును కొల్లగొట్టింది. దేశ కార్లమార్కెట్లో తీవ్రమైన పోటీ నెలకొన్నప్పటికీ ఎప్పటికప్పుడు సరికొత్త మోడళ్లతో వినియోగదారులను ఆకట్టుకుంటూ రావడం ద్వారా మారుతిసుజుకి మార్కెట్‌ లీడర్‌గా తన స్థానాన్ని సంపాదించుకోగలిగింది. తాజాగా సెప్టెంబరు చివరికల్లా 50శాతానికిపైగా మార్కెట్‌ వాటాను సొంతం చేసుకుంది. ఒకప్పటి మార్కెట్‌ ఫేవరేట్‌ మారుతి-800కారుస్థానంలో తీసుకువచ్చిన ఆల్టో అమ్మకాలు సైతం ఊపందుకోగా, మొడ్‌సైజ్‌ విభాగంలో స్విప్ట్‌ దుమ్మురేపింది. ఈ బాటలో కంపెనీ తీసుకువచ్చిన ఎస్‌యువి ఎర్టిగా, ఆటోగేర్‌ మోడల్‌ సెలెరియోతోపాటు ప్రీమియం మోడళ్లు వితారాబ్రెజా, ఇగ్నిస్‌ సైతం వినియోగదారుల మనసులను చూరగోనడంతో మారుతి షేరు ర్యాలీకి అడ్డులేకుండాపోయింది. మారుతి ఆర్థిక పనితీరు సైతం మెరుగుపడుతూ వచ్చింది. 2004లో రూ.561కోట్ల నికరలాభం ఆర్జించిన కంపెనీ 2017 కల్లా రూ.7,339కోట్లకు లాభాల్ని పెంచుకుంది. అమ్మకాలు సైతం రూ.11,000కోట్ల స్థాయి నుంచి రూ.68,000కోట్లను అధిగమించాయి. రూ.243 ఇపిఎస్‌ను సాధించింది. కాగా విదేశీ బ్రేకింగ్‌ దిగ్గజం మోర్గాన్‌ స్టాన్లీ అంచనా ప్రకారం 2020కల్లా మారుతీ అమ్మకాలు రూ.1,18,223కోట్లను తాకనున్నాయి. అంతేకాకుండా రూ.12,760కోట్ల నికరలాభం ఆర్జించనున్నట్లు మోర్గానీ స్టాన్లీ భావిస్తోంది.