మళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌

PETROL
PETROL

న్యూఢిల్లీ: వరుసగా నెలరోజులపాటు వాహనదారులకు ఊరటనిచ్చిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు, 36రోజుల తర్వాత గురువారం మళ్లీ ధరలు పెరిగాయి. పెట్రోల్‌ ధరలు మెట్రో నగరాల్లో 16 నుంచి 17 పైసలు చొప్పున పెరగ్గా, డీజిల్‌ ధరలు 10 నుంచి 12 పైసలు చొప్పున పెరిగాయి. దీంతో లీటరు పెట్రోల్‌ ధర ఢిల్లీలో రూ.75.71గా, కోల్‌కతాలో రూ.78.39గా, ముంబైలో రూ.83.10గా, చెన్నైలో రూ.78.57గా ఉన్నాయి. అదేవిధంగా లీటరు డీజిల్‌ ధర ఢిల్లీలో రూ.67.50గా, కోల్‌కతాలో 70.05గా, ముంబైలో రూ.71.62గా, చెన్నైలో రూ.71.24గా నమోదయ్యాయి. ప్రభుత్వ రంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ఇండియన్‌ ఆయిల్‌, భారత్‌ పెట్రోలియం, హిందూస్థాన్‌ పెట్రోలియం ప్రతిరోజు ఈ ధరల సమీక్ష చేపడుతున్నారు. అన్ని మెట్రో నగరాలతో పోలిస్తే ఢిల్లీలో పెట్రోల్‌ ధరలు తక్కువగా ఉన్నట్లు తెలిసింది. దేశ రాజధానిలో విక్రయపన్ను, వ్యాట్‌ తక్కువగా అమలు చేస్తుండడంతో ఈ ధర ఢిల్లీలో అన్ని నగరాలతో పోలిస్తే తక్కువగా ఉంది. కాగా, గత నెలరోజుల్లో పెట్రోల్‌ ధరలు 22సార్లు, డీజిల్‌ ధరలు 18 సార్లు తగ్గించారు. మిగతా రోజల్లో యధావిధిగా ఉన్నాయి. తాజాగా అంతర్జాతీయంగా వీస్తున్న ఆందోళనకర పరిస్థితులతో దేశీయంగా కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మళ్లీ పెరగడం జరిగిందని తెలిసింది.