ఫండ్స్‌ ఎంపికలో ఇదో కీలకం

 FUNDS
FUNDS

ఫండ్స్‌ ఎంపికలో ఇదో కీలకం

న్యూఢిల్లీ: మ్యూచువల్‌ ఫండ్స్‌ ఎంచుకోవడంలో అందరూ వాటి పనితీరునే చూస్తుంటారు. కానీ కేవలం ర్యాంకింగ్‌ ప్రాతిపదికన ఆ ఫండ్స్‌లో గుడ్డిగా పెట్టుబడులు పెట్టకూడదని ఆర్థికసలహాదారులు చెబుతున్నారు. ఎందుకంటే కేవలం ర్యాంకింగ్‌ మాత్రమే కాదు మార్కెట్‌ పరిస్థితులు కూడా మ్యూచువల్‌ ఫండ్స్‌పై ప్రభావం చూపవచ్చని వారు అంటున్నారు. ప్రధానంగా మ్యూచువల్‌ పండ్స్‌ అనేది దీర్ఘకాల పెట్టుబడుల కిందకు వస్తాయి. సాధారణంగా క్రిసిల్‌, ఇక్రా, కేర్‌ వంటి క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీలు మ్యూచువల్‌ ఫండ్స్‌కు ఒకటి నుంచి 5స్టార్స్‌ రేటింగ్‌ల ను ప్రకటిస్తుంటాయి. ర్యాంకింగ్‌ అనేది ఫండ్‌ రిస్క్‌ను సూచిస్తుంది. అంతేకాకుండా ఫండ్‌ మేనేజర్‌ ట్రాక్‌ రికార్డు, ఫండ్‌ సైజు, ఫండ్‌ కాల వ్యవధి ఆధారంగా ర్యాంకింగ్‌ లను ఇస్తుంటాయి. అయితే మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టే ముందు తెలుసుకోవాల్సిన 5 ప్రధాన విషయాలు ఏంటో చూద్దాం. పెట్టుబడి స్వరూపం: పెట్టుబడి పెట్టే ముందు అందులో రిస్క్‌ ఎంత ఉందో తెలుసకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎంత ఎక్కువ రిస్క్‌ తీసుకుంటే అంత ఎక్కువ లాభాలు ఉంటాయి అనేది మార్కెట్‌లో సాధారణ సూత్రం అయితే చాలా మంది షార్ట్‌ టర్మ్‌లో నష్టాలు వచ్చినా, దీర్ఘకాలికంగా స్థిరమైన లాభాల కోసం పెట్టుబడులు పెడుతుంటారు. దీర్ఘకాలంలో లాభాల కోసం స్థిరమైనఒక లక్ష్యం ఏర్పాటు చేసుకోవడం చాలా అవసరం. వ్యయనిష్పత్తి: వ్యయ నిష్పత్తి అనేది మీ లాభాలను చాలావరకూ తినే స్తుంది. ఈ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక సలహాదారుల సూచనల ప్రకారం వ్యయ నిష్పత్తి 1.5శాతం వరకూ ఉంటే మంచిదే. అయితే సాధారణంగా మంచిపనితీరు ఇచ్చే ఎంఎఫ్‌ల మీద పెద్దగా ప్రభావం ఉండదు. అయితే ఎంఎఫ్‌లపనితీరు కొంత గతి తప్పినా వ్యయ నిష్పత్తి కారణంగా మరింత నష్టపోయే అవకాశముంది. ఫండ్‌ మేనేజర్‌: ఫండ్‌ ఎంచుకోవడంలో ఫండ్‌ మేనేజర్‌ దే కీలకపాత్ర. పోర్ట్‌ఫోలియో కూర్పు ద్వారానే ఫండ్‌ లాభదాయకత ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఫండ్‌ మేనేజర్‌ గత పనితీరును ఆధారంగా తీసుకోవాలి. అలాగే పోర్ట్‌ఫోలియో ఎంపిక కూడా ఫండ్‌ మేనేజర్‌ సామర్థ్యాన్ని తెలియచేస్తుంది. బెంచ్‌మార్క్‌: బెంచ్‌మార్క్‌ ద్వారానే ఫండ్‌ ఎలా పని చేస్తుందో తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇతర ఫండ్స్‌ కన్నా ఎంత బాగా పనిచేస్తుందో తెలుసుకునేందుకు బెంచ్‌ మార్క్‌ తెలుపుతుంది. ఔట్‌ పెర్ఫార్మ్‌ చేస్తున్న ఫండ్స్‌ను గుర్తించడం ద్వారా అందులో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది. పనితీరు అనేదే ఫండ్స్‌లో అసలైన విషయం. ఒక ఫండ్‌లోని పోర్ట్‌ఫోలియో ఎంత బాగాపనిచేస్తే అంత బాగా లాభాలు వస్తుంటాయి. స్థిరమైన లాభాలు ఇచ్చే ఫండ్స్‌ను ఎంపిక చేసుకుంటే మీ మదుపుకు భద్రత భరోసా దొరుకుతుంది.