పాన్‌ కార్డులో కొందరికి తండ్రిపేరు తొలగింపు!

PAN CARD
PAN CARD

కొత్తనిబంధనలతో పాన్‌కార్డులు జారీ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పాన్‌కార్డుకు నిబంధనలు తీసుకొస్తోంది. తండ్రి పేరు నమోదు చేయకుండానే, ఒంటరి తల్లుల పిల్లలు పాన్‌కార్డును దరఖాస్తు చేసుకునేలా మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ (డబ్ల్యూసిడి) ప్రతిపాదించింది. మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ నిర్ణయాన్ని మహిళా కార్యకర్తలు, జాతీయ మహిళా కమిషన్‌ స్వాగతించాయి. ఒక నివేదికనుఅనుసరించి మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ ఈ విషయంపై తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయల్‌కు లేఖ రాసినట్లు తెలిసింది. విడాకులు తీసుకున్న తల్లులు లేదా బిడ్డలను దత్తత తీసుకున్న ఒంటరి తల్లుల విషయంలో పాన్‌కార్డులో తండ్రి పేరు తొలగించే అవకాశాన్ని కల్పించాలని ఆమె కోరారు.జులై 6న గోయల్‌కు ఈ లేఖ రాశారు. ఒంటరి తల్లుల విషయంలో సున్నితత్వాన్ని దృష్టిలో పెట్టుకొని, పలు ప్రభుత్వ అథారిటీల ముందు సమర్పించే దరఖాస్తులో వారి మాజీ భర్తల పేర్లను నమోదు చేయాల్సినవసరం లేకుండా, అవకాశం కల్పించడం ఎంతో ముఖ్యమని మేనకా గాంధీ చెప్పారు. అంతేకాకుండా పిల్లల్ని దత్తత తీసుకుని పెంచే తల్లులకు, తండ్రి ఉండరని, అలాంటి కేసుల్లో కూడా తండ్రి పేరు అవసరం లేకుండా పాన్‌కార్డును దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. మహిళల్లో సాధికారికత కల్పించడానికి దీన్నిముందస్తుగానే అమలు చేయాల్సి ఉందని, ఇది చాలా ప్రతిగశీలమైదని, ప్రస్తుతం ఇది చాలా మంచి నిర్ణయమని జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రేఖా శర్మ అన్నారు. ఓ పురుషుడితో మహిళలు తమను తాము గుర్తింపు పొందాల్సినవసరంలేదని, వారికి సాధికారికత కల్పించే విషయంలో ఎంతో స్వాగతించాల్సిన విషయమని పేర్కొన్నారు.ప్రస్తుతం పాన్‌కార్డు దరఖాస్తు చేసుకునేటప్పుడు తండ్రి పేరు నమోదు చేయడం తప్పసరి. దీన్నే గుర్తింపుకార్డుగా కూడా భావిస్తున్నారు. ఒంటరి తల్లులు ఎదుర్కొనే చాలా సమస్యలను ఇది పరిష్కరిస్తుందని మహిళా హక్కుల కార్యకర్త మరియం ధవాలే అన్నారు.