పబ్లిక్‌ ఇష్యూకు హడ్కో రెడీ!

hudco
hudco

పబ్లిక్‌ ఇష్యూకు హడ్కో రెడీ!

ముంబయి, మే 7: ప్రభుత్వరంగంలోని గృహపట్టణాభివృద్ధి సంస్థ హడ్కో పబ్లిక్‌ ఇష్యూ సోమవారం ఎనిమిదవ తేదీ ప్రారంభిస్తోంది. ఈ నెల 11వ తేదీ గురువారం ఇష్యూ ముగుస్తుంది. ఇష్యూధర రూ.56-60లుగా నిర్ణయించింది అర్హత కల కంపెనీ ఉద్యోగులు, రిటైల్‌ ఇన్వెస్టర్లకు ధరలో రూ.2 డిస్కౌంట్‌ ఇస్తోంది. ఇష్యూలో భాగంగా ప్రభుత్వం 20.40కోట్లకుపైగా షేర్లను విక్రయించనున్నది. దీనివల్ల 10.2శాతం వాటాను అమ్ముతోంది. రూ.1225 కోట్లవరకూ సమీకరించాలని భావిస్తోంది. మినీ రత్న హోదా కలిగిన సంస్థ ప్రధానంగా హౌసింగ్‌ అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రాజెక్టులకు రుణాలు మంజూరుచేస్తుంటుంది. ప్రధానంగా అందుబాటు ధరలో గృహనిర్మాణ ప్రాజెక్టులకు మద్దతు పలుకుతుంటుంది. 2016 డిసెంబరుకల్లా జారీచేసిన 36,385కోట్ల రుణాల్లో 69శాతాన్ని పట్టణాభివృద్ధికి వీల య్యే మౌలిక సదుపాయాలకే కేటాయించింది. 31శాతం నిధులు గృహరంగానికి అందించింది. గత ఏడాది కంపెనీ రూ.1169 కోట్ల రాబడులు సాధిం చడంతోపాటు 496 కోట్ల రూపాయల నికరలాభం ఆర్జించింది. రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం 200 షేర్లకు దరఖాస్తు చేసుకోవాలి. ఆపై గుణిజాల్లో రూ.2లక్షల పెట్టుబడికి మించకుండా దరఖాస్తుచేసుకోవచ్చు. కంపెనీ షేర్లు బిఎస్‌ఇ, ఎన్‌ఎస్‌ఇల్లో జాబితా అవుతాయి. రిటైల్‌ ఇన్వెస్టర్ల కేటగిరీలో కంపెనీ 35శాతం వాటాను విక్రయించనున్నది. ఇష్యూ తర్వాత కంపెనీలో ప్రభుత్వ వాటా 89.8శాతంగా ఉంటుంది.