నష్టాల్లో దేనా బ్యాంకు షేర్లు

DENA BANK
DENA BANK

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులైన దేనా బ్యాంక్‌, విజయా బ్యాంక్‌లను బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో విలీనం చేయడానికి కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. కాగా, ఈ ప్రభావం ఆయా బ్యాంక్‌ షేర్లపై పడింది. విలీనంతో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేర్లు లాభాల్లో ఉండగా.. దేనా, విజయా బ్యాంక్‌ షేర్లు మాత్రం కుప్పకూలాయి. ముఖ్యంగా దేనా బ్యాంక్‌ షేర్లు దాదాపు 20శాతం నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈరోజు మార్కెట్‌ ఆరంభం నుంచే దేనా, విజయా బ్యాంక్‌ షేర్లు భారీ నష్టాల్లో సాగుతున్నాయి. ఒక దశలో దేనా బ్యాంక్‌ షేరు విలువ 19.77శాతం పతనమై రూ. 14.40 వద్ద ట్రేడ్‌ అయ్యింది. మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో దేనా బ్యాంక్‌ షేరు విలువ ఎన్‌ఎస్‌ఈలో 18.44శాతం నష్టంతో రూ. 14.60గా కొనసాగుతోంది. ఇక విజయా బ్యాంక్‌ షేరు విలువ 5.78శాతం నష్టపోయి రూ. 48.10 వద్ద ట్రేడ్‌ అవుతోంది. మరోవైపు బ్యాంక్ ఆఫ్‌ బరోడా షేర్లు మాత్రం స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఎన్‌ఎస్‌ఈలో బీఓబీ షేరు ధర 1.72శాతం లాభంతో రూ. 121.50 వద్ద కొనసాగుతోంది.