దీపావళికి తగ్గనున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

petrol prices
petrol prices

న్యూఢిల్లీ: రోజువారి ధరల సమీక్షా విధానం అమల్లోకి వచ్చిన తరువాత దేశంలో పెట్రోల్‌,డీజిల్‌ ధరలు అమాంతం పెరిగిపోయాయి.దీంతో సామాన్యుడికి మరింత భారంగా మారింది.అయితే దీపావళి నాటికి వీటి ధరలు దిగివస్తాయని కేంద్ర పెట్రోలియం,సహజవాయువుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తీపి కబురు అందించారు. దీపావళి నాటికి వీటి ధరలు తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు.రోజువారి ఇంధన ధరల సమీక్షతో పెట్రోల్‌,డీజిల్‌ ధరలు పెరగడంతో కేంద్రంపై విపక్షాలు మండిపడుతున్నాయి.దీనిపై స్పందించిన ధర్మేంద్ర ప్రధాన్‌ రోజువారీ ధరల సమీక్ష చాలా  పారదర్శకంగా ఉందని వివరించారు.అమెరికాను వణికిస్తున్న హార్వే, ఇర్మా తుఫానుల వల్ల అంతర్జాతీయంగా రిఫైనరీ ఔట్‌పుట్‌ 13 శాతం పడిపోయిందని,ఈ కారణంగానే ఇంధన ధరలు పెరిగిపోయాయని ఆయన వెల్లడించారు. ఇంధన ధరలు కూడా జిఎస్‌టి పరిధిలోకి వస్తే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రోజు వారి సమీక్ష విధానం అమల్లోకి వచ్చిన రెండు నెలల్లోనే పెట్రోల్‌ లీటరుకు 7 రూపాయలు,5 రూపాయల వరకు పెరిగింది. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాల బాదుడు అదనం.కాగా మంగళవారం అమృత్‌సర్‌లో పర్యటించిన ఆయన ఇంధన ధరలు దీపావళి లోగా తగ్గుతాయని ఒక సంకేతాన్ని ఇచ్చారు.ఇటీవల జరిగిన కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో ప్రధాన్‌కు క్యాబినెట్‌ హోదా దక్కింది. పెట్రోలియం శాఖతో పాటు అదనంగా నైపుణ్యాభివృద్ది,ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ శాఖ బాధ్యతలను కూడా నిర్వర్తిస్తున్నారు.