టెలికాం రంగంలో 75 వేల ఉద్యోగాలు మాయం!

telecom
telecom

ముంబయి: భారత టెలికాం పరిశ్రమకు గ‌డ్డుకాలం న‌డుస్తోంది. ఏడాది కాలంలో ఈ రంగంలో 75,000 మంది ఉద్యోగాలు నష్టపోయారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం నెలకొన్న తీవ్ర ఒత్తిడి, పోటీతత్వంతో టెలికాం ఆపరేటర్లు, టవర్‌ సంస్థలు తమ ఆస్తులు అమ్ముకుంటున్నారు. కొన్ని సంస్థలు విలీనం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో టెలికాం రంగంలో ఉన్న 3,00,000 ఉద్యోగాల్లో నాలుగో వంతు ఖాళీ అయ్యాయి. దీంతో ఉద్యోగుల సంఖ్య 2.25 లక్షలకు కుంచించుకుపోయింది. పరిశ్రమను వదిలేసిన వారిలో 30 శాతం మంది మిడిల్‌ మేనేజ్‌మెంట్‌ విభాగం వారే. టెలికాం రంగంలో దాదాపు 50 శాతం మంది ఈ విభాగంలోనే పనిచేస్తారు. టెలికాం రంగంలోని సంస్థలన్నీ ఆస్తులు విక్రయిస్తుండటంతో ఏడాది కాలంగా ఉద్యోగుల జీతాల్లో పెరుగుదల ఆగిపోయింది. కంపెనీ మొత్తం ఖర్చులో మానవ వనరులకు దాదాపు 4 నుంచి 5 శాతమే అవుతుంది. ప్రస్తుతం దాన్నీ భరించే స్థితిలో కూడా లేకపోవడంతో మొదటి వేటు ఉద్యోగులపైనే పడుతోంది. దీంతో ఈ రంగంలో ఇంకా చాలామంది ఉద్యోగాలు నష్టపోయే ప్రమాదం ముంచుకొస్తోంది. సంస్థలు 36 నెలల వేతన ప్యాకేజీ ఇచ్చి వెళ్లిపొమ్మని చెప్తున్నారని తెలుస్తోంది. ఇక ఖాళీ అయిన ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశమే లేదు! ప్రస్తుతం టెలికాం రంగం రూ.5 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. గతేడాది సెప్టెంబర్‌లో రిలయన్స్‌ జియో రాకతో కంపెనీల రాబడి, లాభాలు, నగదు రాక ఒక్కసారిగా తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో రెండు, మూడు స్థానంలో ఉన్న వొడాఫోన్‌ ఇండియా, ఐడియా సెల్యులార్‌ విలీన ప్రక్రియలో ఉన్నాయి! టాటా టెలీ సర్వీసెస్‌ వైర్‌లెస్‌ వ్యాపారం కొనుగోలుకు ప్రయత్నిస్తున్నట్టు భారతీ ఎయిర్‌టెల్‌ సూచనలు చేసింది. ఇప్పటికే ఐడియా, వొడాఫోన్‌, ఎయిర్‌టెల్‌ తమ టవర్ల సంస్థలను విక్రయానికి పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో టెలికాం సంస్థ‌ల మ‌నుగ‌డ ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.