జిఎస్‌టి ఇబ్బందులు అధిగమిస్తాం: అరవింద్‌ సుబ్రమణియన్‌

aravind subramaniyan
aravind subramaniyan

న్యూఢిల్లీ: జిఎస్‌టి అమలు వల్ల తలెత్తిన ఇబ్బందులు నెమ్మదిగా సమసిపోతున్నాయని ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రమణియన్‌ తెలిపారు. ఆర్థిక సర్వే విడుదలైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 14ఏళ్లలో తొలిసారి సరళీకృత వ్యాపార నిబంధనలు ఉన్న దేశాల జాబితాలో భారత్‌ స్థానం మెరుగుపడడం విశేషమని ఆయన పేర్కొన్నారు. 2016వ సంవత్సరం మధ్యలో వడ్డీరేట్లు పెరగడం డిమాండ్‌పై ప్రభావం చూపిందని తెలిపారు. తయారీ రంగంలో 11.3శాతం వృద్ధి నమోదు చేయడం విశేషమన్నారు. ప్రస్తుతం ఎగుమతులు పుంజుకున్నట్లు ఆయన వివరించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు పుంజుకోవడమే దీనికి కారణమన్నారు. వచ్చే ఏడాది జిడిపి, ఎగుమతులు మరింత పుంజుకునే అవకాశం ఉందన్నారు. భారత సమాఖ్య వ్యవస్థలో సమన్వయం అద్భుత ఫలితాలను ఇస్తుందని జిఎస్‌టి రుజువు చేసిందన్నారు. పెరుగుతున్న చమురు ధరలతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అరవింద్‌ పేర్కొన్నారు. చమురు ధర 10శాతం పెరిగితే జిడిపి వృద్ధి 0.2శాతం పడిపోతుందని తెలిపారు. ఈ ఏడాది చమురు ధరలు 16శౄతం పెరుగుతాయని ఐఎంఎఫ్‌ అంచనా వేసినట్లు చెప్పారు. స్టాక్‌ మార్కెట్లలో కొంత కరెక్షన్‌ జరగవచ్చని, ప్రస్తుతం మాత్రం ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారని అన్నారు. భారత్‌ పరిశోధన, అభివృద్ధి రంగంపై ఎక్కువ దృష్ఠిపెట్టాలని అరవింద్‌ సుబ్రమణియన్‌ పేర్కొన్నారు. దీనిని ఉద్యమ స్థాయిలో చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు.