జిఎస్‌టితో సగటుజీవి ఉత్పత్తులివే!

gst
GST

జిఎస్‌టితో సగటుజీవి ఉత్పత్తులివే!

న్యూఢిల్లీ, జూన్‌ 11: దేశవ్యాప్తంగా వచ్చే జూలై ఒకటవ తేదీ నుంచి అమలుకు వస్తున్న జిఎస్‌టి చట్టంలో సగటుజీవి ఎక్కువ వినియోగించే వస్తువుల జాబితాపై ఐదుశాతం నుంచి 28శాతం వరకూ విధించే పన్నులు కూడా ఉన్నాయి. కేంద్రప్రత్యక్ష పన్నులబోర్డు, కేంద్ర పరోక్ష పన్నులబోర్డు, రెవెన్యూ డైరెక్టరేట్లు సంయుక్తంగా సగటుజీవిపై జిఎస్‌టి పేరిట కొన్ని ఉత్పత్తుల జాబితాను విడుదలచేసారు. బ్రాండెడ్‌ కాని అట్టా, మైదా, బేసిన్‌ చక్కీ, పాకింగ్‌లేని ఆహార ధాన్యాలు, పాలు, గుడ్లు, పెరుగు, లస్సీ తాజా కూర గాయలు, గర్భనిరోధకసాధనాలు వంటివి జిఎస్‌టినుంచి మినహాయింపు జాబితాలో ఉన్నట్లు సిబిఇసి వెల్లడించింది. మొత్తం 81శాతం ఉత్పత్తులన్నీ 18శాతం జిఎస్‌టి కేటగిరీలోపే ఉన్నాయని, 19శాతం ఉత్పత్తులు మాత్రమే 18శాతంపైబడిన పన్ను శ్లాబ్‌లో ఉన్నాయని వెల్లడించింది. ముడిజన పనార, ముడిసిల్క్‌ కూడా ఉన్నాయి. ఇక ఆరో గ్యం, విద్యరంగాలు సేవలరంగం జిఎస్‌టి నుంచి తొలగించారు.

ఐదుశాతం జిఎస్‌టిపరిధి లో చక్కెర, తేయాకు, వేయించిన కాఫీగింజలు, వంటనూనెలు, వెన్నతీసిన పాలపొడి, పాలు చిన్నపిల్లల పాల ఉత్పత్తులు, ప్యాకేజి పన్నీర్‌, నూలుదారం, ఫ్యాబ్రిక్‌, సర్కాందా చీపుళ్లు వంటి వాటితోపాటు 500వరకూ పాదరక్షలు, న్యూస్‌ప్రింట్‌, పిడిఎస్‌ లేదా ప్రజాపంపిణీ వ్యవస్థ కిరోసిన్‌, దేశీయ ఎల్‌పిజి, బొగ్గు, సోలార్‌ ఫోటోవోల్టాయిక్‌ సెల్‌ మాడ్యూల్స్‌, పత్తిదారం, దుస్తులువంటివి వెయ్యిరూపాయల వరకూ ఉన్నవాటిపై ఐదుశాతం జిఎస్‌టి అమలవుతుంది. ఇక 12శాతం జిఎస్‌టి శ్లాబ్‌లో వెన్న, నెయ్యి, మొబైల్‌, జీడిపప్పు, బాదం, సాస్‌లు, పండ్ల రసాలు, ప్యాకింగ్‌చేసిన కొబ్బరినీళ్లు, అగర్‌బత్తి, గొడు గులు, దుస్తులు వంటివి వెయ్యిరూపాయలకు పైబడిన వాటిపై 12శాతం అమలవుతుంది. 18శాతం జిఎస్‌టిలో కేశవర్ధినిలు, సబ్బులు, టూత్‌పేస్ట్‌, భారీ యంత్రపరికరాలు, పారిశ్రామిక ఉత్పత్తులు, పాస్తా, కార్న్‌ప్లేక్స్‌, జామ్‌లు, సూప్‌లు, ఐస్‌క్రీమ్‌లు, టిష్యూపేపర్లు, ఇనుము ఉక్కు, ఫౌంటెన్‌పన్‌, కంప్యూటర్‌, చేతితో వడికిన నూలు, రూ.500కుపైబడిన పాదరక్షలు వంటివి ఉన్నాయి.

ఇక 28 శాతం జిఎస్‌టి అంటే వినియోగరంగ ఉత్పత్తులు సిమెంట్‌, చూయింగ్‌ గమ్‌, సుగంధాలు, షాంపూ, మేకప్‌ ఉత్పత్తులు, పేలుడు ఉత్పత్తులు, మోటార్‌సైకిళ్లు వంటి వాటిపై గరిష్టపన్ను ఉంటుంది.