చమురు ఉత్పత్తి పరిమితులపై చర్చలు

OIL
– దోహాలో 15 దేశాల సమావేశం – ఇరాన్‌ గైర్హాజర్‌
దోహా (ఖతార్‌) : చమురు ఉత్పత్తి కంపెనీలు భవిష్యత్తు ఉత్పత్తి స్తంభనపై ఖతార్‌లో సమావేశం అవుతున్నాయి. అయితే ఈ సమావేశానికి మరో చమురు ఉత్పత్తిదేశం ఇరాన్‌ హాజరుకావడంలేదు. అంతే కాకుండా ఇరాన్‌ చమురు మంత్రి మాట్లాడుతూ తమ దేశం చమురు ఉత్పత్తి స్తంభన ఒప్పందంపై సంత కాలు చేయబోవడం లేదని వెల్లడించారు. అంతర్జాతీయంగా ముడిచమురు తక్కువ ధరలను ఒత్తిడిని అధిగమించాలంటే ముందు ఉత్పత్తిని తగ్గించి డిమాండ్‌ను పెంచే లక్ష్యంతో చమురు ఉత్పత్తి దేశాలు సమా వేశం నిర్వహించి విస్తృత చర్చలు జరపాలని నిర్ణయించాయి. అయితే ఇరాన్‌ చివరినిమిషంలో తాము ఈ సమావేశానికి హాజరుకావడంలేదని ప్రకటించింది. సమావేశానికి హాజరవుతున్న దేశాల్లో సౌదీ చమురు మంత్రి ఆలీల్‌ నైమీ జర్నలిస్టులు అందరినీ దోహాలోని ఒక విలాసవంతమైన హోటల్‌లో బస ఏర్పాటు చేసారు. రష్యా దేశం కూడా సమావేశానికి హాజరయింది. అయితే అమెరికామాత్రం ఈ సమావేశానికి హాజరు కాలేదు. షేల్‌ చమురు ఉత్పత్తిలోఅమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థగా ఉంది. కనీసం 15 చమురు ఉత్పత్తి దేశాలు ప్రపంచంలోని 73శాతం చమురు ఉత్పత్తి వాటాను కలిగి ఉన్నాయి. దోహా సమావేశానికి ఈ దేశాల ప్రతినిధులు అందరూ హాజరు కావచ్చని ఖతార్‌ విద్యుత్‌, పరిశ్రమల మంత్రి మహ్మద్‌ బిన్‌ సాలేహ్‌ ఆల్‌ సదా వెల్లడించారు. గతంలో ఫిబ్రవరిలోనే ఒకపర్యాయం వెనిజులా, రష్యా, ఖతార్‌, సౌదీ అరేబియాలు దోహాలో సమావేశమై తమ ఉత్పత్తిని పరిమితి విదించాలని తాత్కాలిక నిలుపు దలచేయాలని నిర్ణయించాయి. దీనివల్ల అంతర్జాతీయంగా ముడిచమురుధరలు పెరిగేందుకు అవకాశం ఉం టుందని అంచనా. 2014 చివరినుంచి ముడిచమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లనుంచి గణనీయంగా తగ్గిపోయాయి. ప్రస్తుతం 12 ఏళ్ల కనిష్టస్థాయిలో బ్యారెల్‌కు 30 డాలర్లుగా కొనసాగుతున్నాయి. ఈ వారంలోఎనే కొంతమేర పెరిగి 4 డాలర్లకు చేరింది. ఇరాన్‌ అణుఒప్పందం సందర్బంగా ఉన్న అనేక అంతర్జాతీయ ఆంక్షలు తొలగిన తర్వాత ఇరాన్‌ ముడిచమురును యూరోపియన్‌ మార్కెట్‌కు ఎగుమతిచేయడం ప్రారంభించింది. అంతేకాకుండా తన మార్కెట్‌ వాటాను తిరిగి సాధించుకునే యత్నాలు చేస్తోంది. ఇరాన్‌ పరంగా 3.2 మిలియన్‌ బ్యారెల్స్‌ చమురు ఉత్పత్తిచేస్తున్నది. 2017 ఏప్రిల్‌ నాటికి రోజుకు నాలుగు మిలియన్‌ల బ్యారెల్స్‌ ఉత్పత్తిచేయగలమని ఇరానియన్‌ చమురుమంత్రిత్వశాఖ చెపుతోంది. అందువల్ల ప్రస్తుత తరుణంలో తమ దేశం పరంగా ఉత్పత్తిని స్తంభింపచేసే ఒప్పందంపై సంతకం చేయబోమని, అలాగే ఆ సమావేశానికి కూడా హాజరుకాలేమని ఇరాన్‌ స్పష్టంచేస్తోంది. తమ చమురు ఉత్పత్తి ఆంక్షలకు ముందు ఉన్నస్థాయికి వచ్చేంతవరకూ ఎలాంటి ఒప్పందాలకు రాకూడదని ఇరాన్‌ నిర్ణయించుకుంది.