కొన్ని ఉత్పత్తుల ధరలు తగ్గించిన షియోమీ

xiomi
xiomi

న్యూఢిల్లీ: ప్రముఖ చైనా మొబైల్‌ కంపెనీ షియోమీ తన ఉత్పత్తుల ధరలను తగ్గించింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొన్ని వస్తువులపై జీఎస్టీ రేట్లను
సవరించింది. ఈ నేపథ్యంలో సదరు ప్రయోజనాన్ని తమ వినియోగదారులకు బదిలీ చేసేందుకు కొన్ని ఉత్పత్తులపై ధరలను తగ్గించినట్లు కంపెనీ
తెలిపింది. షియోమీ ఇండియా చీఫ్‌ మనుకుమార్‌ జైన్‌ తన ట్విట్టర్‌ ద్వారా ఈ వివరాలను వెల్లడించారు. కాస్ట్‌ కటింగ్‌, పన్ను ప్రయోజనాలను
డిస్కౌంట్ల ద్వారా వినియోగదారులకు అందిస్తుంటామని ఆయన పేర్కొన్నారు. దీనితో ఎంఐ పవర్‌ బ్యాంక్‌, ఎంఐ ఛార్జర్‌, 2 ఇన్‌ 1 యూఎస్‌బి
కేబుల్‌ తదితర ఉపకరణాల ధరలు తగ్గుతాయి. 10 వేల ఎంఏహెచ్‌ పవర్‌బ్యాంక్‌ 2 గతంలో రూ.1,199 ఉండగా, ఇప్పుడు రూ.1,099కి లభిస్తోంది.
ఎంఐ ఛార్జర్‌ గతంలో రూ.799 ఉండగా, ఇప్పుడు రూ.699 అయింది. ఇక ఎంఐ బిజినెస్‌ బ్యాక్‌ప్యాక్‌పై రూ.200 దాకా ధర తగ్గింది. ప్రస్తుతానికి
ఈ తగ్గింపు ధరలు కేవలం కంపెనీ వెబ్‌సైట్‌లో మాత్రమే లభిస్తున్నాయి. ఇక ఇటీవల ఐడీసీ విడుదల చేసిన డేటా ప్రకారం ఈ సంవత్సరం మూడో
త్రైమాసికంలో అత్యధిక స్మార్ట్‌ఫోన్ల విక్రయం ద్వారా శాంసంగ్‌తో కలసి షియోమీ అగ్రస్థానానికి చేరుకుంది. మార్కెట్లో ఈ రెండు సంస్థలు చెరో 23.5
శాతం వాటా కలిగి ఉన్నాయని సదరు నివేదికలో పేర్కొన్నారు.