కేటాయింపులు సరే..నిధులేవీ?

agriculture
agriculture

న్యూఢిల్లీ: దేశంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయ రంగం పరిస్థితులు అంతగా బాగాలేవని, ఈ రంగాల అభివృద్ధిపై ప్రధానంగా దృష్టిని కేంద్రీకరించాలనే ఉద్దేశంతో కేంద్ర బడ్జెట్‌కు రూపకల్పన చేశామని చెపుతున్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ మాటలకు వాస్తవ కేటాయింపులకు ఎక్కడా పొంతన లేదు. కొత్తగా ప్రకటించిన కొన్ని పథకాలకు నిధులే కేటాయించకపోగా, కొన్ని పథకాలకు కొసరు నిధులను మాత్రమే కేటాయించారు. ఇక వ్యవసాయాభివృద్ధి, గ్రామీణ సంక్షేమాభివృద్ధి పథకాలకు గతేడాది కేటాయింపుల్లో పెంచిన శాతం కన్నా తక్కువశాతంలో కేటాయింపులను పెంచారు. మరికొన్ని పథకాలకు తగ్గించారు. ఉదాహరణకు వ్యవసాయరంగానికి కేటాయింపులను మొత్తం ఈ ఏడాది 12.8శాతం పెంచారు. అందులో గ్రామీణ రంగానికి పెంచినది 1.8శాతం. అంతకుముందు బడ్జెట్‌లో ఈ పెంపు 19శాతంగా ఉంది. అలాగే సామాజిక రంగానికి సంబంధించిన స్కీములకు కేటాయింపులు 14.5శాతం పెంచారు. అదే 2016-17 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ఈ కేటాయింపుల పెంపు 21.4శాతంగా ఉంది. ఆరోగ్య రంగానికి కూడా కేటాయింపుల పెంపు 2.8శాతం మాత్రమే ఉంది. అంతకుముందు బడ్జెట్‌లో ఈ పెంపు ఏకంగా 36.5శాతంగా ఉంది. గ్రామీణ వ్యవసాయ, మత్స్యకారుల అభివృద్ధి కోసం కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ అట్టహాసంగా ఫిషరీస్‌ ఆక్వాకల్చర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ను పదివేల కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ నిధికి ప్రస్తుత బడ్జెట్‌లో 47కోట్ల రూపాయలను మాత్రమే కేటాయించారు. పదివేల కోట్లు కావాలంటే కేంద్రానికి ఎన్ని వాయిదాలు కావాలి, ఎన్ని బడ్జెట్‌లు కావాలి? అలాగే ప్రస్తుతం దేశంలో ఉన్న 585 వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్‌ కమిటీల యార్డులను అభివృద్ధి చేయడంతోపాటు కొత్తగా 22వేల గ్రామీణ మార్కెట్‌ యార్డులను ఏర్పాటుకు మార్కెట్‌ మౌలిక సౌకర్యాల అభివృద్ధి నిధికి రెండు వేల కోట్ల రూపాలయను ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ నిధుల కేటాయింపుల గురించి జైట్లీ ప్రసంగంలోని, బడ్జెట్‌ ప్రతిపాదనల్లోగానీ ప్రస్తావనే లేదు. ఈ నిధులను ఎక్కడి నుంచి తీసుకొస్తారు? గ్రామీణుల ఇళ్లల్లో విద్యుత్‌ వెలుగులు నింపేందుకు తీసుకొచ్చిన ప్రధాన మంత్రి సౌభాగ్య యోజన కోసం 16000కోట్ల రూపాయలను కేటాయించిన విషయం తెలిసిందేనని జైట్లీ చెప్పారు. వాస్తవానికి 2017-19సంవత్సరం వరకు అంటే, రెండేళ్లకు కేంద్రం ఇప్పటికే 16,320కోట్ల రూపాయలు మంజూరుకు అనుమతి తెలిపింది. ఆ మొత్తంలో 12,320కోట్ల రూపాయలు కేంద్రం వాటాకాగా, మిగతా సొమ్మును ఆయా రాష్ట్రాలు చెల్లించాల్సి ఉంది. ఆ మొతంతోల 2017-18 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం 3,600 కోట్లరూపాయలను విడుదల చేయాల్సి ఉండగా, కేవలం రెండు వేల కోట్ల రూపాయలను విడుదల చేసింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి 8,720కోట్ల రూపాయలను విడుదల చేయాల్సి ఉండగా, బడ్జెట్‌లో 3,500కోట్ల రూపాయలను మాత్రమే కేటాయించింది. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్‌ సౌకర్యం కోసం అమలు చేస్తున్న దీన్‌ దయాల్‌ ఉపాధ్యా§్‌ు గ్రామ్‌ జ్యోతి యోజన అనే మరో కేంద్ర విద్యుత్‌ పథకానికి ఈ సారి 30శాతం నిధులను తగ్గించారు. గ్రామీణ ప్రాంతాల్లో వెదురు పంటను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 1290 కోట్ల రూపాయలతో జాతీయ వెదురు మిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. అయితే బడ్జెట్‌లో మాత్రం అందుకు 300కోట్ల రూపాయలను మాత్రమే కేటాయించారు. పేద ప్రజల సొంతింటి కలను పరిపూర్ణం చేసేందుకు ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద 51లక్షల ఇళ్లను నిర్మించేందుకు కేటాయింపులను గతేడాదికన్నా తగ్గించారు. గతేడాది 23వేల కోట్ల రూపాయలను కేటాయించగా, ఈ సారి 21వేల కోట్ల రూపాయలతో సరిపెట్టారు. ఇక కేంద్ర ప్రభుత్వం బృహత్తర పథకమైన మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ గ్యారంటీ పథకం కు కూడా ఈ సారి కేయింపులను పెంచలేదు. గతంలో లాగానే 56,000కోట్లకు పరిమితం చేశారు. ఇలా ఏ పథకాన్ని తీసుకున్నా గతంకంటే కేటాయింపులు ఎక్కువగా లేవు. బడ్జెట్‌లో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిపై ఎలాంటి ఫోకస్‌ లేదు. ఆర్థిక మంత్రి, ప్రధాన మంత్రి మాట్లో మ్తారం ఫోకస్‌ బలంగా ఉంది.