ఐడీబీఐ బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు పిలుపు

IDBI
IDBI

హైదరాబాద్‌: ఐడీబీఐ బ్యాంకు అధికారులు కొందరు ఈనెల 16వ తేదీ నుండి ఆరు రోజుల పాటు సమ్మె చేసేందుకు సిద్ధమయ్యారు. ఈమేరకు బ్యాంకు అధికారులు నోటీసులను ఐడీబీఐకు అందించారు. తమకు నోటీసులు అందినట్లు రెగ్యులేటరీ సంస్థలకు ఐడీబీఐ బ్యాంకు సమాచారాన్ని అందించింది. జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ, ఐడీబీఐ బ్యాంకులో 51 శాతం వాటాను కొనుగోలు చేయడం, వేతనానికి సంబంధించిన సమస్యలపై నిరసనగా కొందరు ఐడీబీఐ అధికారులు సమ్మె చేయాలని నిర్ణయించారు. ఈనెల 16వ తేదీ నుండి 21వ తేదీ వరకూ కొందరు అధికారులు సమ్మెకు దిగబోతున్నట్లు ఇచ్చిన నోటీసులను తాము అందుకున్నట్లు ఐడీబీఐ బ్యాంక్‌, రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. 2012 నవంబరు నుండి ఐడీబీఐ బ్యాంకు ఉద్యోగుల వేతనాలను సవరించ లేదు. వేతన సవరణ విషయంలో గత ఏడాది ఓసారి సమ్మె నోటీసు ఇచ్చిన దరిమిలా యాజమాన్యం ఇచ్చిన హామీతో విరమించుకున్నారు. ఐడీబీఐ బ్యాంకులో 51 శాతం బాటాను ఎల్‌ఐసీకి విక్రయించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు ఆల్‌ ఇండియా ఐడీబీఐ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ ఇప్పటికే కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీకి వినతిపత్రం సమర్పించింది.