ఐటిశాఖకు మేలుచేసిన పెద్దనోట్ల రద్దు

TAX
TAX

50శాతం పెరిగిన ఐటి రిటర్నులు
న్యూఢిల్లీ: ఆదాయపు పన్నుశాఖలో రిటర్నులు సుమారు 50శాతంకుపైగా పెరిగాయని సిబిడిటిఛైర్మన్‌ సుశీల్‌ చంద్ర వెల్లడించారు. సిఐఐ సదస్సులో పాల్గొన్న చంద్ర మాట్లాడుతూ గత ఏడాదితోపోలిస్తే 50శాతం రిటర్నులు పెరిగాయన్నారు. పెద్దనోట్ల రద్దు ఒక మంచి పరిణామంగా పన్నులబేస్‌ను దేశంలో పెంచిందని ఆయన అన్నారు. ఈ ఏడాది ఇప్పటికే 6.08 కోట్ల రిటర్నులు దాఖలయ్యాయని గత ఏడాదితోపోలిస్తే 50శాతం ఎక్కువని అన్నారు. రెవెన్యూ విభాగం కూడా ప్రత్యక్షపన్నులపరంగా నిర్దేశించిన లక్ష్యం 11.5 లక్షలకోట్లు సేకరించగలదని ధీమా వ్యక్తంచేసారు. మా స్థూలపన్నుల వృద్ధిరేటు 16.5శాతంగా ఉంది. నికర ప్రత్యక్షపన్నుల వృద్ధిరేటు 14.5శాతంగా ఉందని అన్నారు. పెద్దనోట్ల రద్దు వాస్తవంగా తమ పన్నుబేస్‌ను పెంచేందుకు ఉపకరించిందని అన్నారు. ఇప్పటివరకూ 70 దేశాలతో పన్నులపరంగా సమాచారం పరస్పర మార్పిడి జరుగుతున్నదన్నారు. ఆటోమేటిక్‌ ఇన్‌ఫర్మేషన్‌ ఎక్ఛేంజి ఒప్పందాలపరిధిలో ఈ సమాచార మార్పిడి జరుగుతున్నదని ఆయన వివరించారు. పెద్దనోట్ల రద్దుకారణంగా గత ఏడాది ఏడు లక్షల మంది ఉన్న కార్పొరేట్‌ టాక్స్‌ రిటర్నులు ఈ ఏడాది ఎనిమిది లక్షలకు పెరిగాయన్నారు. కొత్తగా ఇ-పాన్‌ నెంబరును నాలుగుగంటల్లోనే జారీచేసేవిధంగా కొత్త విధానం అమలుచేస్తామని సిబిడిటిఛీఫ్‌ చెప్పారు. ఇప్పటివరకూ రిటర్నులు దాఖలుచేయని వారికి సుమారు రెండుకోట్లమందికిపైగా ఎస్‌ఎంఎస్‌లు పంపించినట్లు సుశీల్‌చంద్ర వివరించారు. వారి ఆదాయవనరులు వారు దాఖలుచేసిన రిటర్నులతో బేరీజువేస్తే ఎక్కడా సక్రమంగా లేదని అటువంటి వారికిసైతం సందేశాలు పంపించామన్నారు.