ఆధార్‌ సాయంతో రూ.90వేల కోట్ల ఆదా!

arun jaitly
arun jaitly

న్యూఢిల్లీ: ఆధార్‌ సాయంతో ప్రభుత్వ ఖజానాకుగత ఏడాది మార్చినెలాఖరువరకూ రూ.90వేల కోట్లు ఆదాచేయగలిగినట్లు ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీ వెల్లడించారు. ఈ పొదుపు మొత్తాన్ని దేశవ్యాప్తంగా మూడు ప్రజాసంక్షేమపథకాలకు వినియోగించగలమని ఆయుష్మాన్‌భారత్‌ వంటి పథకాలకు సైతం వినియోగించుకోగలమని మంత్రి వెల్లడించారు. ఆధార్‌ అమలు ఒక పెద్ద మార్పును తెచ్చిందని, ఈ మొత్తంతోనే ఇతర సంక్షేమపథకాల అమలుకు మరింత వీలుచిక్కిందని అన్నారు. ఆయుష్మాన్‌భారత్‌ వంటి ప్రతిష్టాత్మకపథకాలతో మిలియన్లకొద్దీ నిరుపేదలకు ఆసుపత్రి వైద్యం అందించగలుగుతున్నామన్నారు. ఆధార్‌ను వినియోగించడంద్వారా నకిలీ, అమలులోలేని ఖాతాలను సులువుగా గురించగలిగామన్నారు. ప్రపంచ బ్యాంకు అంచనాలప్రకారం డిజిటల్‌ డివిడెండ్‌ నివేదికను చూస్తే భారత్‌ రూ.77వేల కోట్లు ప్రతి ఏటా పొదుపుచేయగలుగుతుందని వెల్లడించారు. ఆధార్‌ద్వారా పొదుపుచేయడంవల్ల కీలక ఇతర పథకాలకు వినియోగించే అవకాశం చిక్కిందన్నారు. ఆయుష్మాన్‌భారత్‌, ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్య యోజన వంటివి ఒక్కొక్కకుటుంబానికి సాలీనా ఐదు లక్షల రూపాయలు బీమా సౌకర్యం కల్పిస్తున్నాయని, వీటివల్ల సుమారు 10.74 కోట్లమందికి లబ్దిచేకూరుతుందని అన్నారు. ఇప్పటివరకూ ఏడులక్షలమంది నిరుపేద రోగులకు ఆసుపత్రి చికిత్సలు అందించగలిగామన్నారు. ఆధార్‌సాయంతో నేరుగా లబ్దిబదిలీ, సబ్సిడీలు వంటివి రూ.1,69,868 కోట్ల రూపాయలు చేసామని అన్నారు. ఆధార్‌బిల్లును 2016లో ఆమోదించడం జరిగిందని, గడచిన 28 నెలల్లో 122కోట్ల ఆధార్‌ నెంబర్లను జారీచేసామని, 99శాతం వయోజనాభా 18 ఏళ్లకుపైబడిన అందరూ కవర్‌ అయ్యారాన్నరు. 22.80కోట్ల పహల్‌, ఉజ్జ్వల లబ్దిదారులకు వంటగ్యాస్‌ సబ్సిడీలను నేరుగా లబ్దిబదిలీకింద ఆధార్‌ లింక్‌ అయిన బ్యాంకు ఖాతాలకు చేరిందన్నారు. మొత్తం 58.24కోట్ల రేషన్‌ కార్డుదారులు 10.33 కోట్ల ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ కార్డుదారులు వేతన చెల్లింపులు డిబిటిద్వారానే నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు జమ అవుతున్నాయన్నారు. మొత్తం 1.93 కోట్ల లబ్దిదారులు సామాజిక ఆర్ధికసాయం పథకాలను అందుకుంటున్నారన్నారు. ఆదాయపు పన్నుశాఖసైతం 21కోట్ల పాన్‌కార్డుదారులను ఆధార్‌ నెంబర్లతో సీడింగ్‌చేసిందన్నారు. 2,579 కోట్ల ధృవీకరణలు ఇప్పటివరకూ జారీచేసినట్లు తెలిపారు. ప్రతిరోజై 2.7 కోట్ల ధృవీకరణలు చేస్తున్నామి, ఆధార్‌కు పదికోట్ల లావాదేవీలు రోజువారి చేసే సామర్ధ్యం ఉందన్నారు. ఎక్కువపథకాల్లో మొత్తం 63.52 కోట్ల బ్యాంకుఖాతాలను ఆధార్‌తోఅనుసంధానించామని, మొత్తం సబ్సిడీ లావాదేవీలు 425కోట్లమేర జరిగినట్లు వెల్లడించారు.