ఆధార్‌ లేకున్నా పింఛన్‌ ఇవ్వాలి

EPFO
EPFO

న్యూఢిల్లీ: ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఇపిఎల్‌ఒ) బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీచేసింది. ఆధార్‌ లేదన్న సాకు చూపించి, పింఛన్‌దారులకు చెల్లింపులు నిలిపివేయరాదని ఇపిఎఫ్‌ఒ బ్యాంకులను ఆదేశించింది. దీనికి బదులు ప్రత్నామ్నాయ గుర్తింపుకార్డుల ఆధారంగా నెలవారీ చెల్లింపులు జరపాలని సూచించింది. దీనికి సంబంధించి పెన్షన్‌ పంపిణీ చేసే పోస్టల్‌ సర్వీసులకు, బ్యాంకు అధికారులకు ఇపిఎఫ్‌ఒ ఓ సర్క్యూలర్‌ జారీచేసింది. ఆధార్‌లేని వారి గుర్తింపును ప్రత్నామ్నాయ విధానాల్లో నిర్ధారించుకోవాలని పేర్కొంది. అదేవిధంగా బ్యాంకులు పెన్షనర్లకు ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ సౌకర్యం కల్పించాలని ఆదేశించింది. గుర్తింపు కోసం ఫింగర్‌ప్రింట్‌తో ఇబ్బందులు పడుతున్న వారికోసం, ఐరిస్‌ స్కానర్‌ను కూడా బ్యాంకులు ఏర్పాటు చేయాలని తెలిపింది. నెలవారీ పింఛన్‌ను అందుకోవడంలో ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2016 నుంచి పెన్షనర్లు తమ పింఛన్‌ను పొందడానికి జీవన్‌ ప్రమాణ్‌ అనే డిజిటల్‌ లైఫ్‌ సర్టిఫికేట్‌ను పొందాల్సి ఉంటుంది. ఈ డిజిటల్‌ లైఫ్‌ సర్టిఫికేట్‌ను పరిశీలించిన అనంతరం, బ్యాంకులు ఆధార్‌ ఫింగర్‌ప్రింట్‌ ప్రామాణీకరణను చూపడతాయి. అనంతరం పెన్షన్‌ను అందిస్తాయి. అయితే వయసు పైబడటంతో, లబ్ధిదారుడి ఫింగర్‌ప్రింట్‌ ప్రామాణీకరణ సరిగ్గా నమోదుఅవడంలేదు. ఇలాంటి సమస్యలన్నింటిన్నీ పరిగణనలోకి తీసుకున్న భవిష్య నిధి సంస్థ బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసినట్లు కేంద్ర ప్రావిడెంట్‌ ఫండ్‌ కమిషనర్‌ విపి జా§్‌ు తెలిపారు. ఆధార్‌ గుర్తింపు లేని వ్యక్తుల నుంచి సాధారణ ధ్రువీకరణ పత్రాలను తీసుకొని పెన్షన్‌ చెల్లించాలని స్పష్టంచేసినట్లు తెలిపారు. అలాగే నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులు, దివ్యాంగులు ఆధార్‌కార్డు పొందేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని బ్యాంకులను కోరింది. ఆధార్‌ అనుసంధానం పూర్తికానంత మాత్రాన వృద్ధులకు పెన్షన్‌ చెల్లింపుల్లో జాప్యం చోటుచేసుకోరాదని కేంద్ర సమాచార కమిషన్‌ కూడా తేల్చిచెప్పింది. ఏటా నవంబరులో పెన్షన్‌దారుల నుంచి అవసరమైన సర్టిఫికేట్లను సేకరించడంతోపాటు పెన్షన్‌ తీసుకోవడం కోసం సంతకం చేసిన ఒప్పంద పత్రాలను బ్యాంకులు తీసుకోవాలని ఇపిఎఫ్‌ఒ పేర్కొంది.