ఆక్లాండ్‌లో మ‌ళ్లీ లాక్‌డౌన్‌ పొడిగింపు

వెల్లింగ్ట‌న్‌: న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో మ‌ళ్లీ రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ను పొడిగించారు. అక్క‌డ డెల్టా వేరియంట్ వైర‌స్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్న‌ట్లు ప్ర‌ధాని జెసిండా ఆర్డెర్న్ తెలిపారు. మొద‌ట్లో ఒక్క కేసు కూడా న‌మోదు కాని దేశంగా నిలిచిన న్యూజిలాండ్ ఇప్పుడు డెల్టా వేరియంట్‌తో స‌త‌మ‌తం అవుతోంది. ఆక్లాండ్‌తో పాటు పొరుగు ప్రాంతాల్లో కేసులు అధిక సంఖ్య‌లో న‌మోదు అవుతున్నాయి. స‌రిహ‌ద్దు మూసివేత , లాక్‌డౌన్‌ ఆంక్ష‌లు క‌ఠినంగా ఉన్నా వైర‌స్ కేసులు పెరుగుతున్నాయి. సామాజిక క‌ల‌యిక‌ల‌పై ఆంక్ష‌ల‌ను ఎత్తివేయ‌డం లేద‌ని ప్ర‌ధాని అన్నారు. నిబంధ‌న‌ల‌ను స‌డలిస్తే వైర‌స్‌ను నియంత్రించ‌డం వీలుకాదు అని, వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను మ‌రింత వేగం చేయాల‌ని ప్ర‌ధాని జెసిండా అభిప్రాయ‌ప‌డ్డారు.

కాగా, 17 ల‌క్ష‌ల జ‌నాభా ఉన్న ఆక్లాండ్‌లో ఆగ‌స్టు నెల‌లో లాక్‌డౌన్ నిబంధ‌న‌లు మొద‌ల‌య్యాయి. అక్క‌డ స్కూళ్లు, వ్యాపార‌స‌ముదాయాలు, ఆఫీసుల‌ను ఇంకా మూసివేశారు. ఇండోర్స్ స‌మావేశాల‌కు కూడా అనుమ‌తి ఇవ్వ‌డంలేదు. న్యూజిలాండ్‌లో కొత్త‌గా న‌మోదు అయిన ఇన్‌ఫెక్ష‌న్ల‌తో కేసుల సంఖ్య రెండు వేలు దాటింది. సోమ‌వారం కొత్త‌గా 60 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. దాంట్లో ఆక్లాండ్‌లోనే 57 కేసులు న‌మోదు అయిన‌ట్లు అధికారులు తెలిపారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/