కరోనా లో కొత్తగా ‘లాంబ్డా’ వేరియంట్‌

29 దేశాలకు విస్తరించిన కొత్త వేరియంట్

లండన్: కరోనా మహమ్మారి లో డెల్టా, డెల్లా ప్లస్ వేరియంట్‌లు ప్రపంచ దేశాలను వ‌ణికిస్తుండ‌గానే..కొత్తగా ‘లంబ్డా’ అనే వేరియంట్‌ను యూకేలో గుర్తించారు. గతేడాది ఆగస్టులో పెరులో బయటపడిన ఈ రకం ఇప్పుడు 29 దేశాలకు విస్తరించింది. ఇందులో పెరు సహా చిలీ, ఈక్వెడార్, అర్జెంటినా వంటి దేశాలు ఉన్నాయి. ఈ వేరియంట్‌ను ‘దృష్టి సారించాల్సిన వైరస్ రకం’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొనగా, ‘పరిశోధనలో ఉన్న కరోనా రకం’గా బ్రిటన్‌లోని పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ (పీహెచ్ఈ) పేర్కొంది. బ్రిటన్‌లో ఇప్పటి వరకు ఈ తరహా కేసులు ఆరు మాత్రమే వెలుగుచూశాయి.

ఏప్రిల్ నుంచి పెరులో బయటపడిన కొత్త కేసుల్లో ‘లాంబ్డా’ రకానికి చెందినవి ఏకంగా 81 శాతం ఉండడం ఆందోళన కలిగిస్తోంది. చిలీలో గత 60 రోజుల్లో ఈ కేసులు 32 శాతానికి పెరిగాయి. దీని స్పైక్ ప్రొటీన్‌లోని కొన్ని ఉత్పరివర్తనాల వల్ల ఇది ఉద్ధృతంగా వ్యాపించే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అయితే, ఈ వేరియంట్ వల్ల తీవ్ర ఇన్ఫెక్షన్ వస్తుందని కానీ, ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలను ఇది ఏమారుస్తుందని కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లేవని పీహెచ్ఈ పేర్కొంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/